Begin typing your search above and press return to search.

మిస్ కాకుండా రెండింటిపై గురిపెట్టిన టీఆర్ఎస్

By:  Tupaki Desk   |   23 Sep 2020 12:30 AM GMT
మిస్ కాకుండా రెండింటిపై గురిపెట్టిన టీఆర్ఎస్
X
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తోంది. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకెళుతోంది. ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అటు ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇటు రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్‌‌ లేదా జనవరిలో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలను తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఇక ప్రతిపక్షాలు కూడా బాగానే కసరత్తు చేస్తున్నాయి. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా ఓటర్ల నమోదుపైనే దృష్టి సారించి విజయం సాధించిందనే అభిప్రాయాలు అధికార పార్టీలో ఉన్నాయి. అందుకే ఈసారి పకడ్బందీ వ్యూహం అమలు చేసేందుకు రెడీ అయ్యారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నగరంలో కేడర్‌, సంస్థాగత బలం ఉందని, ఇది తమకు లాభిస్తుందని గ్రేటర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో డివిజన్‌లో 40 నుంచి 60, 70 వేల వరకు ఓటర్లు ఉన్నారు. మెజార్టీ డివిజన్లలో పోలయ్యే ఓట్లు 50 శాతంలోపే ఉంటాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదు చేయించే 1000–-1500 ఓట్లు విజయానికి దోహదపడతాయన్న ఆలోచనలో ఉన్నారు. సిట్టింగ్‌ కార్పొరేటర్ల కూడా పలు సూచనలు చేశారు. ‘కొవిడ్‌ దృష్ట్యా మునుపటిలా ప్రచారం నిర్వహించే అవకాశం ఉండదు. మీ డివిజన్ల పరిధిలో గత పరిస్థితులు, అభివృద్ధి పనులతో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా.. నాడు, నేడు ఎలా ఉందో వివరించేలా ఫొటోలతో బుక్‌లెట్‌ లు, వీడియో క్లిప్పింగులు రూపొందించి ప్రచారం చేయాలి’ అని ఇటీవల కేటీఆర్‌ సూచించినట్టు తెలిసింది. మొత్తంగా గ్రేటర్‌, పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న టీఆర్‌ఎస్‌.. తనదైన వ్యూహంతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తోంది.

ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీలను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌‌ఎస్‌ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. 2017 మార్చి నాటికి డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌‌ అర్హత కలిగిన వారిని పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను కార్పొరేటర్లకు అప్పగించబోతున్నట్టు తెలిసింది.. సాధారణ ఓటరు జాబితాలో పేరు లేని వారి వివరాలను వీరు నమోదు చేయించాల్సి ఉంటుందని టార్గెట్ పెట్టారు. ఇప్పటికే ఒక్కో డివిజన్‌ నుంచి 15 మంది పేర్లను కార్పొరేటర్ల ద్వారా పార్టీ నేతలు సేకరించారు.

ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఎన్నికలపై వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది.‌ త్వరలో వారితో వర్క్‌షాప్‌ నిర్వహించి.. ఆన్‌లైన్‌లో పట్టభద్రుల ఓటర్ల నమోదు ఎలా చేయాలన్న దానిపై శిక్షణ ఇస్తామని ఓ నాయకుడు చెప్పారు. ఇందులో భాగంగా.. సోమవారం పింగలి వెంకట్రామిరెడ్డి హాలులో గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో మంత్రులు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు.

పాత పరిస్థితులు రిపీట్‌ కావద్దంటే కార్యకర్తలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు.ఒక్కో కార్పొరేటర్‌ తమ డివిజన్‌లో 1,000–-1,500 మంది పట్టభద్రులు, సాధారణ ఓటర్ల పేర్లు నమోదు చేయించాలని కేటీఆర్ లక్ష్యం నిర్దేశించారు. ఇది గ్రేటర్‌ ఎన్నికలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకూ ఉపయోగపడుతుందని టీఆర్‌‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఎలాగైనా.. పట్టభద్రుల ఎమ్మెల్సీని, జీహెచ్‌ఎంసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ పావులు కదుపుతోంది.