అమెరికాలో ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపేశారు

Thu Dec 03 2015 10:01:23 GMT+0530 (IST)

14 dead in Southern California mass shooting

ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రపంచంలోని పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. తమ దేశంలో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమెరికా చెబుతుంటుంది. కానీ.. గడిచిన రెండు వారాల వ్యవధిలో కాలిఫోర్నియా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి కాల్పులు మరోసారి చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏకంగా 14 మంది (కొన్ని మీడియా సంస్థలు మృతుల సంఖ్య 20 వరకు ఉండొచ్చంటున్నారు)ని పొట్టన బెట్టుకున్నారు. మరో 20 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.సైనిక దుస్తుల్లో వచ్చిన వారు.. వికలాంగుల సేవా కేంద్రంలోకి వచ్చీ రావటంతోనే విచక్షణారహితంగా కాల్పులు జరపటం సంచలనంగా మారింది. నల్లరంగు వాహనంలో వచ్చిన వారంతా సైనిక దుస్తులు ధరించినట్లుగా చెబుతున్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులతో సేవా కేంద్రం బీభత్సంగా మారింది. ఎక్కడ చూసినా రక్తంతో టెర్రర్ పుట్టేలా ఉంది.

కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ బెర్నార్డినో నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇదే ప్రాంతంలో గడిచిన రెండు వారాల్లో ఇదే తీరులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగ బడ్డారు. తాజాగా కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సేవా కేంద్రంలోకి వచ్చిన దుండగులు వచ్చీ రావటంతోనే కాల్పులు జరిపారని.. దీంతో.. ప్రాణ భయంతో పలువురు పారిపోయి దాక్కున్నారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

ఇలాంటి కాల్పుల ఘటనలు నవంబరు 23న మొదలయ్యాయి. న్యూ ఓర్లియాన్స్ నగరంలోని ఒక పార్కులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీయటం.. ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడితే.. అది జరిగిన నాలుగు రోజులకు అంటే నవంబరు 27న కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ వరుస షాకుల నుంచి తేరుకోక ముందే.. తాజాగా ఈ దాడి జరగటంతో అమెరికాలో కలకలం రేగుతోంది.