Begin typing your search above and press return to search.

జడ్జీలపై దూషణ కేసు: మరో ఇద్దరి అరెస్ట్

By:  Tupaki Desk   |   30 July 2021 4:18 AM GMT
జడ్జీలపై దూషణ కేసు: మరో ఇద్దరి అరెస్ట్
X
ఏపీలోని న్యాయమూర్తులను, వారి తీర్పులను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది.. పోస్టులు పెట్టిన వారిపై కొరఢా ఝలిపిస్తోంది. ఇప్పటికే నిందితులతో ఓ భారీ జాబితా తయారు చేసిన సీబీఐ.. నెలకింద కడప జిల్లా నుంచి అరెస్ట్ లు ప్రారంభించింది. దీంతో కోర్టు తీర్పులపై కామెంట్లు చేసిన వారిలో వణుకు మొదలైంది. తాజాగా అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుంటున్న సీబీఐ దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుపుతోంది.

హైకోర్టు జడ్జీలపై దూషణల కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జడ్జీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఇదివరకు ఒకరు అరెస్ట్ కాగా.. తాజాగా మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని గుంటూరు సివిల్ జడ్జి కోర్టులో గురువారం హాజరుపరుచగా ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది.

సోషల్ మీడియాలో పలు అభియోగాలు మోపుతూ పోస్టింగ్ లు పెట్టడంతో అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనంతరం కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే 15వ నిందితుడు లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. బుధవారం ప్రధాన నిందితుడైన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం మూలపల్లికి చెందిన ధనిరెడ్డి కొండారెడ్డి, 3వ నిందితుడైన గుంటూరుకు చెందిన పాముల సుధీర్ లను తాజాగా అరెస్ట్ చేశారు.

వీరిలో కొండారెడ్డి ధనిరెడ్డి వైఎస్ఆర్ సీపీ, గుంటూరు మహానగరం పేరు మీద ఫేస్ బుక్ ఖాతాలున్నాయి. నిందితుల్లో ఒకరైన పాముల సుధీర్ గుంటూరులో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు.

గత ఏడాది హైకోర్టు తీర్పులపై కొందరు న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. అనుకూలంగా తీర్పులు రావడం లేదని వ్యతిరేకంగా ఇస్తున్నారని సోషల్ మీడియాలో హోరెత్తించారు.రోడ్లపై బ్యానర్లు కట్టి వ్యతిరేకించారు. హైకోర్టు జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు విచారణ చేపట్టింది. తొలుత స్థానిక పోలీసులు, తర్వాత సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అయితే సీఐడీ విచారణ సాగకపోవడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

అప్పటి నుంచి సీబీఐ అధికారులు ఈ పోస్టులు, వాటి మూలాలపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితులతో భారీ జాబితానే తయారు చేశారు. ఇందులో ఒక్కొక్కరిగా అరెస్ట్ లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

న్యాయమూర్తులను దూషించిన కేసులో సీబీఐ తయారు చేసిన నిందితుల జాబితా పెద్దగానే ఉన్నట్టు తేలింది. అయితే ఇందులో 15వ నిందితుడిగా ఉన్న వ్యక్తిని సీబీఐ ముందుగా అరెస్ట్ చేసింది. కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. తొలి 14 మందిని వదిలి 15వ నిందితుడిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక స్థానిక కోర్టులో కస్టడీ పిటీషన్ వేసి లింగారెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కస్టడీలో రాజశేఖర్ రెడ్డి నుంచి సీబీఐ మరిన్ని వివరాలు రాబట్టింది. కడప జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి. ఇతడిని ఈనెల 10న సీబీఐ పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతడికి రిమాండ్ విధించారు. మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

అయితే తొలి వాయిదాకే లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి డుమ్మా కొట్టాడు. లింగారెడ్డి గౌర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇంత నిర్లక్ష్యమా అని జడ్జి ప్రశ్నించారు. వారెంట్ జారీ అవ్వడంతో లింగారెడ్డి కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు.కోర్టు ఆదేశాలు పాటించలేదని ప్రశ్నించిన న్యాయమూర్తి లింగారెడ్డికి ఆగస్టు 5 వరకు రిమాండ్ విధించింది. ఇప్పుడు మరో ఇద్దరి అరెస్ట్ తో ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచినట్టైంది.