Begin typing your search above and press return to search.

ఏలూరు కార్పొరేష‌న్: మృతి చెందిన అభ్యర్థులు విజయం ... ఆ ఇద్దరు ఎవరంటే ?

By:  Tupaki Desk   |   26 July 2021 6:34 AM GMT
ఏలూరు కార్పొరేష‌న్: మృతి చెందిన అభ్యర్థులు విజయం ... ఆ ఇద్దరు ఎవరంటే ?
X
విజయం తమదే ధీమాతో ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు వివరించి తమకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు. అనుకున్నదే జరిగింది , చివరికి విజయం వారి ముంగిటికి వచ్చేసరికి వారే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. క‌రోనాపై ఓడిన ఇద్ద‌రు అభ్య‌ర్థులు ప్ర‌జాక్షేత్రంలో విజ‌యం సాధించడం గ‌మ‌నార్హం. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగ్గా కోర్టు కేసుల కారణంగా లెక్కింపు వాయిదా పడింది. తాజాగా హైకోర్టు తీర్పుతో నిన్న లెక్కింపు ప్రారంభం కాగా, వైసీపీ ఘన విజయం సాధించింది.

ఓటర్ల జాబితాలో అవకతవక లున్నట్లు హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, కౌంటింగ్‌ ఎప్పుడు నిర్వహించాలో తరువాత ప్రకటిస్తామని కోర్టు చెప్పింది. ఈ క్రమంలో కేసును కొట్టివేస్తూ కరోనా వైరస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం కౌంటింగ్ నిర్వ‌హించాల‌ని మే 7న న్యాయ‌స్థానం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియకు రెండు నెలల పాటు ఎస్ ఈ సీ బ్రేక్ వేసింది. క‌రోనా వైరస్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆదివారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మూడు డివిజ‌న్లు మిన‌హాయించి 47 డివిజ‌న్ల‌ను వైసీపీ ద‌క్కించుకుంది. అయితే క‌రోనా బారిన ప‌డిన ఇద్ద‌రు వైసీపీ అభ్య‌ర్థులు మృతి చెంద‌డం గ‌మ‌నార్హం. వీళ్లిద్ద‌రూ కూడా ఘ‌న విజ‌యం సాధించారు. కానీ గెలుపును ఆస్వాదించ‌డానికి ఇద్ద‌రు వైసీపీ అభ్య‌ర్థులు ఇప్పుడు ప్రాణాలతో లేకపోవడం విచారకరం.

45వ డివిజ‌న్ అభ్య‌ర్థి బేత‌పూడి ప్ర‌తాప‌చంద‌ర ముఖ‌ర్జీ 1058 ఓట్ల‌తోనూ, 46వ డివిజ‌న్ అభ్య‌ర్థి ప్యారీ బేగం 1232 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన‌ట్టు నిన్న‌టి ఫ‌లితాలు తేల్చి చెప్పాయి. ఈ ఇద్ద‌రు అభ్య‌ర్థులు రెండు నెల‌ల క్రితం మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృత్య‌వును ఆశ్ర‌యించారు. దీంతో ఆ రెండు డివిజ‌న్ల‌కు ఉప ఎన్నిక అనివార్యం. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు రెండు నెలల క్రితం కరోనా బారినపడి మృతి చెందారు. కాగా, ఈ ఎన్నికల్లో 47 డివిజన్లలో విజయం సాధించిన వైసీపీ నగర పీఠాన్ని దక్కించుకుంది. ఈ నెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.