అమిత్ షా 'కశ్మీర్' పర్యటనకు ముందు రెండు భారీ పేలుళ్లు

Thu Sep 29 2022 12:32:19 GMT+0530 (India Standard Time)

Two Bomb Blasts Before Amit Shah Kashmir Tour

జమ్ముకశ్మీర్ లో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అన్నింటికి మించి.. మూడు రోజుల వ్యవధిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు కాస్త ముందుగా చోటు చేసుకున్న ఈ పేలుళ్లు కొత్త టెన్షన్ కు కారణమవుతున్నాయి. అంతేకాదు.. భద్రతా బలగాలకు.. నిఘా వర్గాలకు కొత్త సవాలుగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు కలకలాన్నిరేపుతోంది.బుధవారం రాత్రి ఉదమ్ పూర్ లోని పెట్రోల్ బంక్ సమీపంలోని డొమిల్ చౌక్ ప్రాంతంలో మొదటి పేలుడు చోటు చేసుకోగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రెండో పేలుడు ఈ ఉదయం (గురువారం)తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఈ పేలుడులో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆసక్తికర అంశం ఏమంటే.. ఈ రెండు పేలుళ్లు.. బస్సును లక్ష్యంగా చేసుకొని చోటు చేసుకున్నవి కాగా.. ఈ రెండు ఉదంతాలు బస్టాండ్ కు సమీపంలోనే జరగటం గమనార్హం.

రెండు బాంబు పేలుళ్లు ఎనిమిది గంటల వ్యవధిలోనే చోటు చేసుకోవటం ద్వారా.. పేలుళ్ల బాధ్యులు కొత్త సవాలు విసిరినట్లుగా చెప్పాలి. ఈ రెండు పేలుళ్ల మధ్య దూరం కేవలం 4 కిలో మీటర్ల పరిధిలోనే ఉండటం విశేషం. ఇదంతా చూస్తే.. పక్కా ప్లాన్ తో ఒకే ప్రాంతంలో దగ్గర దగ్గర ఉన్న రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరపటం ద్వారా.. భారత సర్కారుకు తమ సత్తా ఎంతన్న విషయాన్ని తెలియజేసే సంకేతాన్ని ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

ఈ రెండు పేలుళ్ల ఉదంతంలో బస్సుల చుట్టూ ఉన్న వాహనాలు కూడా దెబ్బ తిన్నట్లు చెబుతున్నారు. పేలుడు సంభవించినంతనే పోలీసులు.. భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నాయి. పేలుళ్లకు కారణాలు ఇంతవరకు బయటకు రాలేదు.

ఆరు నెలల క్రితం ఉధంపూర్ లో జంట పేలుళ్లు జరగటం.. ఆ సందర్భంగా ఒకరు మరణించగా.. మరో 17 మంది గాయపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ లో పర్యటించటానికి ముందుగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.