ట్విటర్ మొండిఘటమే.. అలా చేయాలంటే ఇలా చేసిందట

Sun Jun 06 2021 10:06:20 GMT+0530 (IST)

Twitter is stubborn .. to do so is to do so

డిజిటల్ ప్రపంచంలో నారద మునీశ్వరుడి పాత్రను అచ్చుగుద్దినట్లుగా జీవిస్తున్నది ఏమైనా ఉందంటే అది ట్విటర్ అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే ఎన్నో పరిణామాలకు ట్విటర్ మూలమని చెప్పాలి. ఎంతో మంది రాజకీయ నేతల బతుకుల్ని ‘ట్వీట్ల’ పుణ్యమా అని బస్టాండ్ చేసిన ఘన చరిత్ర ఈ సోషల్ మీడియా సంస్థ సొంతమని చెప్పాలి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో సదరుసంస్థ తరచూ వివాదాల్లో చుట్టుకుంటోంది. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రముఖుల విషయంలో బ్లూ టిక్ ను తొలగించటం తాజా వివాదం. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి వ్యక్తిగత ట్విటర్ ఖాతాకున్న బ్లూ మార్కు (ప్రముఖులకు ట్విటర్ కేటాయించేది) తొలగించటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అది సరిపోదన్నట్లుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ట్విటర్ ఖాతాకు బ్లూ టిక్ తీసేశారు. ఆయనతో పాటు బీజేపీ.. సంఘ్ కు చెందిన మరో నలుగురు ప్రముఖులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.దీంతో..కేంద్రం వార్నింగ్ ఇవ్వటం.. తాను తప్పు చేయలేదని.. సిస్టంలో భాగంగా జరిగిందని ట్విటర్ వివరణ ఇచ్చుకుంది. ఎవరైనా తమ అకౌంట్ ను ఆర్నెల్లు వినియోగించకపోతే ఆటోమేటిక్ గా బ్లూ టిక్ తొలిగిపోతుందని సదరు సంస్థ చెబితే.. ఇదంతా కుట్ర.. గతంలో చాలామంది ఆర్నెల్లకు మించి వాడకున్నా ఏమీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేంద్రం అదలింపు కావొచ్చు.. కీలక వ్యక్తులకు సంబంధించిన వారు రంగంలోకి దిగటంతో పోయిన బ్లూ టిక్ లు తిరిగి వచ్చాయి.

మొత్తంగా మరెవరికి ఎదురుకాని అనుభవాలు తమకు ఎదురవుతున్నట్లుగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు కూడా ఇదే నిజమని నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. తమకు తిరుగులేదని ఫీలయ్యే మోడీ సర్కారుకు ట్విటర్ లాంటి వ్యాపార సంస్థ తీరు తీవ్రఆగ్రహానికి గురి చేస్తోంది. అందుకే.. కొత్త ఐటీ చట్టాన్ని అమలు చేయాలన్న నోటీసును ఇవ్వటమే కాదు.. చట్టంలో పేర్కొన్నట్లుగా చేయకపోతే ఐటీ చట్టం కింద లభించే మినహాయింపుల్ని కోల్పోవాల్సి ఉంటుందన్న వార్నింగ్ ఇచ్చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడిచిన కొంతకాలంగా ట్విటర్ తో సహా సోషల్ మీడియా సంస్థలు.. దేశీయంగా ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంప్రదించటానికి ఒకరు ఉండాలని చెప్పటం తెలిసిందే. దీనికి ట్విటర్ ఏం చేసిందో తెలుసా? ఒక ప్రత్యేక అధికారిని నియమించమని చెప్పిన చట్టం మాటను ఎలా అమలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వ్యక్తిని నియమించటానికి బదులుగా ఒక లా సంస్థ చిరునామాను ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

తన అకౌంట్ కు సంబంధించి సవా లచ్చ రూల్స్ చెప్పి.. అందులో ఏది అమలు కాకున్నా సిస్టం అటోమేటిక్ గా తీసుకునే నిర్ణయాలే తప్పించి తాము ఏమీ చేయమని చెప్పే ట్విటర్ ముదురు తెలివితేటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యేక అధికారి నియామకానికి బదులు ట్విటర్ వ్యవహరించిన తీరుపై కేంద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఘాటు వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. ట్విటర్ ఏం చేస్తుందో చూడాలి.