అతి పెద్ద హ్యాక్ .. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి : ట్విట్టర్ సీఈవో!

Thu Jul 16 2020 16:20:32 GMT+0530 (IST)

The Biggest Hack .. Soon All Will Be Fixed: Twitter CEO!

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా పెద్ద ఎత్తున ప్రముఖుల - దిగ్గజ సంస్థల ఖాతాలు హ్యాక్ కు గురయ్యాయి. ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి.. వారి పేరుతో ట్వీట్ చేసిన సైబర్ నేరగాళ్లు బిట్ కాయిన్ స్కామ్ కు ప్రయత్నించారు. వెంటనే బిట్ కాయిన్స్ పంపితే -అందుకు రెట్టింపు మొత్తాన్ని తిరిగి పొందవచ్చని హ్యాకర్లు ఆ ఖాతాల్లో తెలిపారు. హ్యాకర్స్ లిస్ట్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా -ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్ అభ్యర్థి జో బిడెన్ -మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ - టెస్లా సీఈవో ఎలన్ మస్క్ -అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ - వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.మొదట టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఖాతాలో బిట్ కాయిన్ స్కామ్ కు పాల్పడేందుకు హ్యాకర్లు చేసిన ట్వీట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే బిల్ గేట్స్ ఖాతాలోనూ ఇటువంటి ట్వీట్లే కనిపించాయి. దీనిపై బిల్ గేట్స్ ప్రతినిధి రికోడ్స్ టెడ్డీ స్పందించి..ఈ ట్వీట్ ను బిల్ గేట్స్ చేయలేదు అని తెలిపారు. ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసిన విషయాన్ని గుర్తించిన ట్విట్టర్ వెంటనే రంగంలోకి దిగింది. వారి ఖాతాలను కాసేపు నిలిపేసి ఆ ఖాతాల్లో హ్యాకర్లు చేసిన ట్వీట్లను తొలగించింది. ఈ విషయాన్ని తమ ట్విట్టర్ సపోర్ట్ ఖాతాల్లో ట్విట్టర్ సంస్థ వివరించింది.

ఈ వ్యవహారం పై ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. ట్విట్టర్ సంస్థకు ఇదో క్లిష్టమైన రోజని ఇలా ఎందుకు జరిగిందో నిర్ధారించుకునేందుకు కృషి చేస్తున్నామని జాక్ డోర్సే తెలిపారు. జరిగిన తప్పిదాన్ని గుర్తించి సరిచేసేందుకు ట్విట్టర్ బృందం తీవ్రంగా శ్రమిస్తోందని త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అని ఆయన వెల్లడించారు.