లెక్కలన్నీ ఫలిస్తే..అమెరికా పీఠంపై హిందూ మహిళ

Sun Jan 13 2019 11:25:27 GMT+0530 (IST)

అన్నీ కలిసి వస్తే - అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అద్భుతం చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీపడనున్నారు. ఆమె  వేస్తున్న లెక్కలన్నీ ఫలిస్తే - అధ్యక్ష పీఠాన్ని అధిరోహించవచ్చు.!అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తొలిసారి హిందూ మహిళ తులసీ గబ్బార్డ్ (37) పోటీ పడుతున్నారు. హవాయి నుంచి అమెరికా ప్రతినిధుల సభకు డెమొక్రటిక్ పార్టీ తరుఫున వరుసగా నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న తులసీ గబ్బార్డ్  తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తలపడనున్నట్లు ఆమె ప్రకటించారు. తద్వారా అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర లిఖించేందుకు సన్నద్ధమవుతున్నారు.లాస్ ఏంజిల్స్‌లో గత ఏడాది జరిగిన ఒక సమావేశంలో భారత సంతతికి చెందిన డాక్టర్ సంపత్ శివంగి ఆమె పేరును ప్రతిపాదించారు. ఇదే సమావేశంలో మాట్లాడిన తులసీ గబ్బార్డ్ తన పోటీ విషయాన్ని ధ్రువీకరించడం గానీ తిరస్కరించడం గానీ చేయలేదు. దీనిపై క్రిస్మస్ లోగా నిర్ణయం తీసుకోనున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే 2019 వరకు దీనిపై ప్రాథమిక ప్రకటన చేయరాదని ఆమె భావించి తాజాగా వెల్లడించారు. 2020 ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడేందుకు తులసి - ఆమె బృందం నిశ్శబ్దంగా భారత సంతతి అమెరికన్లతోపాటు ఇతర దాతల నుంచి విరాళాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇండో-అమెరికన్లలో అత్యంత ప్రజాదరణ గల నేతగా గబ్బార్డ్‌కు మంచి రికార్డే ఉంది. యూదు అమెరికన్ల తర్వాత సంపన్నులైన ఇండో-అమెరికన్ల మనస్సు చూరగొనేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కీలక రాష్ర్టాల్లో ఇండో అమెరికన్లే ఆమె విజయావకాశాల్లో కీలకం.

తులసీ గబ్బార్డ్ భారతీయురాలు కాదు. హవాయి సెనెటర్ మైక్ గబ్బార్డ్ - హిందూమతం స్వీకరించిన కరోల్ పొర్టర్ గబ్బార్డ్ దంపతులకు ఆమె జన్మించారు. ఒకవేళ డెమోక్రటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే దేశాధ్యక్ష పదవి రేసులో ప్రధాన పార్టీ ఎంపిక చేసిన తొలి హిందూ అభ్యర్థి కానున్నారు. గత ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో హవాయి స్థానం నుంచి అమెరికా ప్రతినిధుల సభకు తులసి నాలుగోసారి ఎన్నికయ్యారు. చట్టసభ సభ్యురాలిగా భగవద్గీతపై ఆమె ప్రమాణం చేశారు. తొలిసారి 2012 అమెరికా కాంగ్రెస్ కు ఆమె పోటీ చేశారు. డెమోక్రాట్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హరిస్ తోపాటు మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ - సెనేటర్లు ఎలిజబెత్ వారెన్ - కిర్ స్టెన్ గిల్లిబ్రాండ్ - అమీ క్లొబుచర్ - టిమ్ కైన్ తదితరులు పోటీ పడుతున్నారు. అధికార రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు అంతా సిద్ధమైంది. కానీ ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు.