వీసాలు లేకుండా అమెరికా.. ఇలా వెళ్తున్నారా?

Sat Aug 13 2022 19:00:01 GMT+0530 (IST)

4 Gujarati youths Arrested For Entering US Illegally

భారతీయుల్లో చాలామంది కల.. డాలర్ డ్రీమ్స్. ఈ డాలర్ డ్రీమ్స్ ను నెరవేర్చుకోవాలంటే అమెరికా వెళ్లడమే దారి. అయితే చాలామంది సక్రమ పద్ధతుల్లో వీసా ప్రక్రియను పూర్తి చేసి అమెరికా వెళ్తుండగా మరికొంతమంది తప్పుడు పద్ధతుల్లో అమెరికా వెళ్లే ప్రయత్నంలో పట్టుబడుతున్నారు.ఇలా అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశించాలనుకునేవారు ముందుగా అమెరికా సరిహద్దు దేశాలైన మెక్సికో కెనడా ఎల్ సాల్వడార్ గ్వాటెమాలా హోండురస్ కు చేరుకుంటున్నారు. అయితే భారతీయులు మాత్రం కెనడా మెక్సికోల నుంచి అమెరికాలోకి అక్రమ మార్గాల్లో ప్రవేశిస్తున్నారని చెబుతున్నారు. కెనడా మెక్సికో వీసాలు త్వరగా లభించడంతో ఆ దేశాలకు వెళ్తున్నారు. ఇక అక్కడ నుంచి అక్రమ పద్ధతుల్లో అమెరికా పంపే ట్రావెల్ ఏజెంట్లు ఉంటారని చెబుతున్నారు. ఇందుకోసం వారు దాదాపు కోటి రూపాయలు వసూలు చేస్తారని అంటున్నారు.

ఇటీవల నలుగురు గుజరాత్ యువకులు ఇలా అక్రమ పద్ధతుల్లో అమెరికాలోకి ప్రవేశిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నలుగురి వద్ద ఐఈఎల్‌టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్ష పాసయినట్టు సర్టిఫికెట్లు కూడా లభించాయి. కానీ జడ్జి అడిగిన ప్రశ్నలకు ఆ నలుగురు యువకులు ఆంగ్లంలో సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ నలుగురు యువకులు కెనడా నుంచి రేజిస్ నది గుండా అమెరికాలో ప్రవేశించబోతూ దొరికిపోయారు.

కేవలం ఈ నలుగురు మాత్రమే కాకుండా వీసా లభించని భారతీయులు కొంతమంది ఇలా అక్రమ పద్ధతుల్లో కెనడా మెక్సికోల నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని చెబుతున్నారు. ఇందుకోసం వీరు ట్రావెల్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. ట్రావెల్ ఏజెంట్లు వీరి నుంచి భారీగానే దండుకుంటున్నారని.. కోటి రూపాయలపైనే చార్జ్ చేస్తున్నారని పేర్కొంటున్నారు.

ముఖ్యంగా మనదేశంలో గుజరాత్‌తోపాటు పంజాబ్ హరియాణా రాష్ట్రాలకు చెందిన ప్రజలు అమెరికాకు అక్రమ మార్గాల్లో ఎప్పటి నుంచో వెళ్తున్నారని అంటున్నారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. గత ఏడాది అక్టోబరు నవంబరు డిసెంబరుల్లో 5 లక్షల మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు.

అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ 2019 నివేదిక ప్రకారం.. భారత్ క్యూబా ఈక్వెడార్ లాంటి దేశాల నుంచి ఎక్కువగా వలసదారులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఒక్క 2019లోనే భారత్‌కు చెందిన దాదాపు 8000 మంది అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారని సమాచారం.

ముఖ్యంగా అడవులు ఎడారులు గుండా అమెరికాలోకి ప్రవేశిస్తారని తెలుస్తోంది. దారిలో స్థానికులు సాయం చేసేలా ట్రావెల్ ఏజెంట్లు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఆహారం నీరు దుస్తులు ఇచ్చి స్థానికులు సాయం అందిస్తారని చెబుతున్నారు.