Begin typing your search above and press return to search.

గంపెడు విమ‌ర్శ‌లు.. గుప్పెడు స్వోత్క‌ర్ష‌లు.. చివ‌రాఖ‌రుకు కేసీఆర్ తేల్చిన నిజం ఇదే!

By:  Tupaki Desk   |   30 Nov 2021 2:30 AM GMT
గంపెడు విమ‌ర్శ‌లు.. గుప్పెడు స్వోత్క‌ర్ష‌లు.. చివ‌రాఖ‌రుకు కేసీఆర్ తేల్చిన నిజం ఇదే!
X
తాను చెప్ప‌దలుచుకున్న‌ది నేరుగా చెప్పే అల‌వాటు లేని నాయ‌కుల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందు వ‌రుస‌లో ఉంటా రు. త‌న‌కు ప్ల‌స్ అనుకుంటే.. ప్ర‌జ‌ల్లో త‌న‌కు మంచి చేస్తుంద‌ని అనుకుంటే.. ఒక విధంగా.. త‌నపై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావిస్తే.. మ‌రో విధంగా రియాక్ట్ అయ్యే.. ఆయ‌న తాజాగా మీడియా మీటింగ్ పెట్టారు. స‌మావేశం ప్రారంభిస్తూనే.. కేంద్రంపై మాట‌ల తూటాలు సంధించారు. కేంద్రాన్ని అద‌న్నా.. ఇద‌న్నారు.. ఇంకేదో అన్నారు. కేంద్రంలో ఉన్న మంత్రులు ద‌ద్ద‌మ్మ‌ల‌ని స‌ర్టిఫికెట్లు ఇచ్చారు. ఇక‌, వ‌రి విష‌యంలో కేంద్రం ఆడుతున్న‌దంతా నాట‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ప‌నిలో ప‌నిగా.. బీజేపీ విధానాల‌ను కూడా దుయ్య‌బ‌ట్టారు.

``ప్ర‌జ‌ల్లో మ‌త పిచ్చి రెచ్చ‌గొడుతున్నారు. మ‌తాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారు. కేంద్రం చేతులు ఎత్తేసింది కాబ‌ట్టి ధాన్యం కొనే ప‌రిస్థితి లేదు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండ‌వు. పేగులు తెగే దాకా నేనే కొట్లాడాను. బీజేపీ వాట్సాప్ యూనివ‌ర్సిటీలో ప‌చ్చి అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తోంది. అంబానీ, అదానీల కోస‌మే మూడు సాగు చ‌ట్టాలు తెచ్చారు. రైతులు వ్య‌తిరేక‌త తెల‌ప‌డంతో నే వెన‌క్కి త‌గ్గారు. రాష్ట్రం ధాన్యం సేక‌రించే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాదు. కేంద్రం పారిపోయింది కాబ‌ట్టి.. మేం కొన‌లేమ‌ని చెబుతున్నాం. మీది న‌ర‌హంత‌క ప్ర‌బుత్వం, మాది రైతు బంధు ప్ర‌భుత్వం. వ‌ర్షాకాలం పంట‌ను ఎంతైనా కొంటాం.`` అని వ్యాఖ్యానించారు.

అంతే.. గంట సేపు చేసిన విమ‌ర్శ‌లు.. వ‌రుస పెట్టిన తిట్టిన తిట్లు.. అన్నీ కూడా.. త‌ను చేయ‌బోయే ప‌నిని చెప్పుకొనే భాగంలో త‌న‌కు మ‌ర‌కలు అంటుకోకుండా.. ఉండేందుకు కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నంగానే చూడాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి.. కేంద్రం నాలుగు నెల‌ల కింద‌టే.. రాష్ట్రాల నుంచి లేఖ‌లు రాయించుకుంది. బాయిల్డ్ రైస్ తీసుకునేది లేద‌ని చెప్పింది. అయితే.. ఇప్పుడు కేసీఆర్ సార్ మాత్రం.. త‌మ మెడ‌పై క‌త్తి పెట్టి రాయించుకుంద‌ని అంటున్నారు. మ‌రి.. అంత ప‌రిస్థితి కేసీఆర్ ఎందుకు తెచ్చుకున్నార‌నేది తెలంగాణ స‌మాజానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. రేపు అంతే విధంగా మెడ‌పై క‌త్తిపెట్టి.. అధికారం ఇచ్చేయ‌మంటే.. ఇచ్చేస్తారా? అనే ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆయ‌న స‌మాధానం చెప్పాలి.

కేంద్రం తెస్తున్న చ‌ట్టాల‌కు అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ స‌ర్కారు కూడా భ‌జ‌న చేస్తోంద‌నేది కేంద్రంలో వినిపిస్తున్న మాట‌. చివ‌రాఖ‌రుకు.. తాము కూడా రైతుల‌కు చేసేది ఏమీ లేదు.. మీరు పంట‌లు వేయొద్దు.. అని చెప్ప‌డం ద్వారా .. ఎక్క‌డ ఎదురు గాలి వీస్తుందో.. ఎక్క‌డ‌ వ్య‌తిరేక పెరుగుతుందో అనేభ‌యంతో గ‌డిచిన 15 రోజులుగా కేసీఆర్ నాట‌కాలు ఆడుతున్నార‌నే విమ‌ర్శ‌ల‌కు తాజాగా జ‌రిగిన‌.. మీడియా మీటింగ్ ప‌రాకాష్ట‌కు చేర్చింది. మ‌రి ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి వెల‌గ‌బెట్టింది ఏంట‌నే ది కూడా ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చెప్పి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.