Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం: ‌జీ-7 స‌ద‌స్సుకు రావాల‌ని ఫోన్‌

By:  Tupaki Desk   |   3 Jun 2020 3:30 AM GMT
ప్ర‌ధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం: ‌జీ-7 స‌ద‌స్సుకు రావాల‌ని ఫోన్‌
X
అమెరికాలో త్వ‌ర‌లో జ‌రిగే జీ-7 సదస్సుకు రావాల‌ని భార‌త ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించారు. ఈ విషయమై ప్ర‌ధాని మోదీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ విష‌యాన్ని ప్రధాని కార్యాలయం మంగ‌ళ‌వారం ధ్రువీకరించింది. ట్రంప్‌తో మోదీ ఫోన్‌లో సంభాషించినట్టు తెలిపింది. అమెరికాలో జరిగే జీ-7 సదస్సుకు హాజరుకావాల‌ని మోదీని ట్రంప్‌ కోరారని వివ‌రించింది. ఇరు దేశాల్లో వైర‌స్ వ్యాప్తి, ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న అల్లర్లు, జీ-7 కూటమి, భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులతో పాటు పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చిన‌ట్లు స‌మాచారం.

ఇటీవల జీ-7 కూటమిని విస్తరించాలని ట్రంప్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. భారత్‌ సహా ర‌ష్యా, ద‌క్షిణ‌కొరియా, ఆస్ట్రేలియా దేశాలను చేర్చి జీ-10 లేదా జీ-11 దేశాల కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని ట్రంప్ సూచించారు. జూన్‌లో నిర్వహించాల్సిన జీ -7 దేశాల సదస్సును సెప్టెంబర్‌కి వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉండ‌డంతో స‌ద‌స్సు నిర్వ‌హ‌ణే అతిక‌ష్టంగా మారింది. ముఖ్యంగా అమెరికాలో ఆ వైర‌స్ తీవ్ర‌రూపంలో ఉంది. స‌ద‌స్సు స‌మ‌యానికి ప‌రిస్థితులు స‌రిదిద్దుకుంటాయో లేదో వేచి చూడాలి. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను ఆలోచించుకుని ప్ర‌ధాని వెళ్లాలో లేదో నిర్ణ‌యించుకోనున్నారు.