Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ట్రంప్.. కేటీఆర్ పంచ్

By:  Tupaki Desk   |   26 Nov 2020 10:10 AM GMT
గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ట్రంప్.. కేటీఆర్ పంచ్
X
బలాన్ని ప్రదర్శించటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం లేదన్న పరిస్థితి నెలకొంది. కేసీఆర్ ను ఎదురించే ధీరుడు.. మగాడు లేడన్న మాట కొందరి నోట వినిపిస్తుంటుంది. అంతో ఇంతో ఎదరిరించే కాంగ్రెస్ కామ్ కావటం.. ఆటలో అరటిపండులా మిగిలిపోవటంతో.. తెలీని రాజకీయ శూన్యత నెలకొంది.

ఇక.. బీజేపీ ఉన్నప్పటికీ.. తెలంగాణను సీరియస్ గా తీసుకున్నట్లుగా ఇప్పటివరకు అనిపించని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం తమ ప్రాధాన్యతలో ఉందన్న విషయాన్ని కమలనాథులు ఇప్పటివరకు స్పష్టం చేయని పరిస్థితి. ఆ మాటకు వస్తే.. తెలంగాణ బీజేపీ నేతలే.. టీఆర్ఎస్ తో తాము ఎలా మెలగాలన్న విషయంపై క్లారిటీ ఉండటం లేదన్న మాట తెలంగాణ రాష్ట్ర బీజేపీ అగ్రనేతల నోటి నుంచి తరచూ వినిపించేది.

ఎప్పుడైతే తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ చేతుల్లోకి వచ్చాయో.. అప్పటి నుంచి పార్టీ వ్యవహారశైలి మారింది. దూకుడుగా దూసుకెళ్లే తీరును ప్రదర్శిస్తున్న ఆయన వైఖరికి తగ్గట్లే ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేయటంతో బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సీరియస్ గా తీసుకోవటం షురూ చేసినట్లు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఈ హడావుడిని ఊహించని టీఆర్ఎస్ కు ఇప్పుడు ఇబ్బందికరపరిస్థితి నెలకొంది. తమ అంచనాలకు భిన్నంగా దూసుకెళుతున్న కమలనాథుల తీరుకు మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వానికి చెందిన పలువురు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రావటాన్ని ఎక్కెసం చేస్తూ.. హైదరాబాద్ కు స్వాగతం.. వరదలప్పుడు పరామర్శించటానికి రాలేదు కానీ.. ఇప్పుడు వస్తున్నారా? అంటూనే.. వచ్చేటప్పుటు సీఎం కేసీఆర్ కోరిన నిధుల్ని తీసుకొని రండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

అక్కడితో ఆగని కేటీఆర్.. రానున్న రోజుల్లో అమిత్ షా సైతం ప్రచారానికి వస్తున్న వైనంపై పంచ్ విసిరారు. చూస్తుంటే.. బీజేపీ నేతలు డొనాల్డ్ ట్రంప్ లాంటి అంతర్జాతీయ నేతల్ని కూడా తీసుకొచ్చేట్లుగా ఉన్నారే అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని చూస్తుంటే.. వివిధ రాష్ట్రాల నుంచి గ్రేటర్ ప్రచారం కోసం వస్తున్న నేతల తీరు తెలంగాణ అధికారపక్షంపై ఒత్తిడిని పెంచుతున్నట్లుగా చెప్పక తప్పదు.