Begin typing your search above and press return to search.

అది ట్రంప్ విమానమా ... మరో వైట్ హౌసా !

By:  Tupaki Desk   |   19 Feb 2020 11:15 AM GMT
అది ట్రంప్ విమానమా ... మరో వైట్ హౌసా !
X
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత పర్యటన కి రానున్నారు. రెండ్రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ నెల 24న భారత్ రానున్నారు. ట్రంప్ దంపతులు దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో పర్యటిస్తారు. ట్రంప్ పర్యటన నేపథ్యం లో ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లని పూర్తిచేసింది. అలాగే గుజరాత్ మొత్తం మోడీ, ట్రంప్ ఫొటోలతో నిండిపోయింది. ఇకపోతే ట్రంప్ ఈ పర్యటనకి తన సతీమణి మెలానియాతో కలిసి రాబోతున్నారు.

అమెరికా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్‌ దంపతులు భారత్‌ పర్యటనకు విచ్చేయనున్నారు. మాములుగా ట్రంప్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇదే విమానంలో వెళ్తారు. ఈ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం , గత అమెరికా అధ్యక్షుల విమానాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న బోయింగ్ 747-200బీ విమానం చాలా శక్తివంతమైనది. అతి పెద్ద అధ్యక్ష విమానం కూడా ఇదే. అధ్యక్షలుగా ఉండే వారు ప్రయాణాలకు వివియోగించే విమానాలలో లాంగ్ రేంజ్ గల విమానం ఇది. ఒకరకంగా చెప్పాలి అంటే ..అమెరికాలో ట్రంప్ ఉండే భవనం శ్వేతసౌధం అయితే.. ఈ విమానం ఎగిరే శ్వేత సౌధం.

ఈ విమానంలో ఉన్న సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే.. గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం కలదు. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్‌ స్పేస్‌ ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా విభజించి కాన్ఫరెన్స్‌ హాల్‌, డైనింగ్‌ రూమ్‌, అధ్యక్షుడు, అతని సతీమణికి ప్రత్యేక గదులు, సీనియర్‌ స్టాఫ్‌ కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక గది, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ఉద్యోగులకు, మీడియాకు ఇలా వేరువేరు గదులు ఉన్నాయి. అలాగే ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్‌ సదుపాయం కలదు. భద్రత విషయానికొస్తే అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీ దీని సొంతం. హాల్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ కలదు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌పై దాడులు జరిగితే మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌ గా పని చేస్తుంది. హాల్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు కలవు. 747-200బీ రెక్కల పొడవు 195 అడుగులు కాగా.. ఇది టేకాఫ్‌ తీసుకునేటపుడు మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది. ఈ విమానంలోనే మరో ఐదు రోజుల్లో ట్రంప్ ఇండియాకి రాబోతున్నారు.