Begin typing your search above and press return to search.

టీఆర్పీ స్కామ్: అర్నాబ్ గోస్వామికి షాక్!

By:  Tupaki Desk   |   20 Oct 2020 4:00 AM GMT
టీఆర్పీ స్కామ్: అర్నాబ్ గోస్వామికి షాక్!
X
తన డిబేట్లలో రాజకీయ నాయకులను ఊపిరి సలుపనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసి మూడు చెరువుల నీళ్లు తాగించే ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి భారీ షాక్ తగిలింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్పీ) పొందడం కోసం అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో ఆయనపై ముంబై పోలీసులు ఇటీవల ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టేసేలా ఆదేశాలివ్వాలంటూ అర్నాబ్ సంస్థ దాఖలు చేసిన పిటీషన్ ను ముంబై హైకోర్టు కొట్టివేసింది.

ఈ వ్యవహారంలో అరెస్ట్ నుంచి అర్నాబ్ కు రక్షణ కల్పించలేమని.. కేసుపై ముంబై పోలీసులు విచారణ కొనసాగించవచ్చని.. వెంటనే అర్నాబ్ కు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ముంబైలోని కొన్ని ఇళ్లలో టీఆర్పీ రేటింగ్ కోసం కొన్ని సాంకేతిక పరికరాలు అమర్చి అక్రమాలకు పాల్పడ్డారని ముంబై పోలీసులు గుర్తించి రిపబ్లిక్ టీవీతోపాటు మరో మూడు చానెళ్లపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు అక్టోబర్ 6న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ రిపబ్లిక్ టీవీ యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీం కోర్టు కేసు నమోదైంది ముంబైలో కాబట్టి ముంబై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

ముంబై హైకోర్టులో విచారణ సందర్భంగా అరెస్ట్ నుంచి అర్నాబ్ కు రక్షణ కల్పించలేమని కోర్టు ఖరాఖండిగా చెప్పుకొచ్చింది. అర్నాబ్ కు నోటీసులు ఇవ్వాలంటూ ముంబై పోలీసులను ఆదేశించింది.

కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంపై అర్నాబ్ గోస్వామి దుమ్మెత్తిపోశారు. తీవ్రంగా తిట్టిపోయడం.. జర్నలిజం విలువలను పక్కనపెట్టి మరీ విమర్శలకు దిగడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే టీఆర్పీ స్కాంలో అర్నాబ్ గోస్వామి దొరకడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారన్న టాక్ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

దీంతో ఇప్పుడు టీఆర్పీ స్కామ్ ను సీబీఐకి అప్పగించాలని అర్నాబ్ లాయర్లు కోర్టును కోరగా.. కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది. తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.