Begin typing your search above and press return to search.

కరోనా డెడ్ బాడీ కోసం ఆరుగురిని కిడ్నాప్ చేసిన గిరిజనులు !

By:  Tupaki Desk   |   6 July 2020 8:10 AM GMT
కరోనా డెడ్ బాడీ కోసం ఆరుగురిని కిడ్నాప్ చేసిన గిరిజనులు !
X
కరోనా మహమ్మారి పేరు వింటేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతున్నారు. కరోనా సోకింది అంటే ..వారి దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సాహసం చేయడంలేదు. కనీసం మృతదేహం అంత్యక్రియలకు కూడా ఎవరు రావటంలేదు. కానీ , కరోనాతో చనిపోయిన తమ నాయకుడి మృతదేహాన్ని తమకి అప్పగించాలని అమెజాన్‌ తెగకు చెందిన గిరిజనులు ఆరుగురిని కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటన ఈక్వెడార్‌లోని పెరువియన్ సరిహద్దుకు సమీపంలో గురువారం (జులై2) జరిగింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఆగ్రహంతో ఉన్న గిరిజనులు వారిని ఏమైనా చేస్తారని భావించారు. ఈ క్రమంలో గిరిజనులకు, ప్రభుత్వానికి చర్చలు జరిగాయి. చర్చల అనంతరం బంధించిన వారిని గిరిజనులు ఆదివారం విడుదల చేశారని ప్రభుత్వం వెల్లడించింది.

పూర్తి వివరాలు చూస్తే ... ఆగ్నేయ ఈక్వెడార్‌ లోని అమెజాన్‌ అడవిలో ఉన్న పాస్తాజా ప్రావిన్స్ ‌లోని కుమయ్ గ్రామంలోని గిరిజన నేతకు కరోనా సోకింది. దీంతో సదరు గిరిజన నాయకుడు కరోనా నుండి కోలుకోలేక తాజాగా మృతిచెందాడు. ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు సదరు గిరిజన నాయకుడి మృతదేహాన్ని వారే ఖననం చేశారు. ఈ విషయం తెలిసిన గిరిజనులు ఒప్పుకోలేదు. మా నాయకుడి పార్థివదేహాన్ని మాకే అప్పగించాలని కోరారు. కానీ ఖననం కార్యక్రమం పూర్తి అయిపోయింది ఇక మృతదేహాన్ని ఎలా ఇస్తాం అని అన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన గిరిజనులు మా సంప్రదాయం ప్రకారమే మేమే మా నాయకుడికి అంత్యక్రియలు చేస్తాం..మాకు మృతదేహాన్ని అప్పగించాలని పట్టుపట్టారు.

కానీ అధికారులు దానికి ఒప్పుకోకపోవటంతో వారి నాయకుడి డెడ్ బాడీ కోసం పోలీసులతో పాటు సాధారణ పౌరులను కూడా గిరిజనులు కిడ్నాప్ చేయటంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖననం చేసిన గిరిజన నాయకుడి మృతదేహాన్ని వెలికి తీసి..కుమయ్ గ్రామానికి తరలించారు. దీంతో బంధించిన వారిని గిరిజనులు ఆదివారం వదిలిపెట్టారు. ఈ విషయాన్ని ఈక్వెడార్‌ అంతర్గత మంత్రి పౌలా రోమో ట్వీట్ ద్వారా వెల్లడించారు. పోలీసులతో పాటు ఆరుగురిని కిడ్నాప్ చేసిన బృందంలో సమారు 600 మంది గిరిజనుల ఉన్నారని తెలిపారు.