Begin typing your search above and press return to search.

30 ఏళ్ల తర్వాత 47 బుల్లెట్లు దిగిన టైంలోనే ట్రైలర్ లాంఛ్

By:  Tupaki Desk   |   27 Jan 2022 3:50 AM GMT
30 ఏళ్ల తర్వాత 47 బుల్లెట్లు దిగిన టైంలోనే ట్రైలర్ లాంఛ్
X
తెలంగాణ రాజకీయాల్లో తమదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న రాజకీయ దంపతులు ఎవరైనా ఉన్నారంటే అది కొండా దంపతులనే చెప్పాలి. వారి జీవితంలో ఎదురైన ఘటనలతో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మూవీ తీయటం తెలిసిందే. సినిమాను అనౌన్స్ చేసిన నాటి నుంచి ఏదో ఒక ఇష్యూ తెర మీదకు రావటం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ విడుదలను జనవరి 26న అని డిసైడ్ చేసినప్పటికీ.. ఏదో ఒక అడ్డంకిని చూపి ట్రైలర్ విడుదలను ఆపుతారన్న వాదన వినిపించటం.. ఈ క్రమంలో వర్మ ఒక వీడియోను విడుదల చేసి.. కొండా మూవీ ట్రైలర్ ఆపే దమ్ముందా? అంటూ ప్రశ్నించటం వాతావరణం వేడెక్కేలా చేసింది.

అయితే.. అనుకున్న రీతిలోనే బుధవారం (జనవరి 26) ఉదయం సరిగ్గా 10.25గంటల వేళలో ఈ మూవీ ట్రైలర్ ను వరంగల్ లోని కొండా ఆఫీసులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ టైంను ఎంచుకోవటానికి కారణం.. ముప్ఫై ఏళ్ల క్రితం ఇదే రోజున ఇదే సమయానికి కొండా మురళీ మీద ఫైరింగ్ జరిగందని.. ఆయన ఒంట్లో 47 బుల్లెట్లు దించినా బతికి బయటపడిన వైనాన్ని గుర్తు చేసేలా.. సరిగ్గా ఆయనపై కాల్పులు జరిగిన వేళను ఎంచుకొని మరీ విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది.

ట్రైలర్ లాంఛ్ సందర్భంగా కొండా మురళీ మాట్లాడుతూ.. వర్మకు తాను రెండు ముక్కలు చెబితే.. ఆయన వంద మంది వద్దకు వెళ్లి ఎంక్వైరీ చేసి.. విషయాల్ని తనకు తాను నిర్దారించుకున్న తర్వాత సినిమా తీశారన్నారు. రెండు నెలల పదహారు రోజుల పాటు వరంగల్ లో ఉండి షూట్ చేశారన్నారు. ఎక్కడా పెద్దగా ఉండని వర్మ.. వరంగల్ లో రెండున్నర నెలలు ఉన్నారంటే.. ఆయనకు కథ ఎంత నచ్చిందో తెలుస్తుందన్నారు.ఇదే జనవరి 26న ఉదయం తనపై ఫైరింగ్ జరిపి.. 47 బుల్లెట్లను దించినప్పటికీ తాను బతికానని.. అది తన కుటుంబం కోసం కాదని.. ప్రజల కోసమన్నారు. ఆ రోజు బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ వేసుకోవటంతో బతికిపోయినట్లు చెప్పారు. సినిమా గురించి చెప్పే కన్నా చూస్తే బాగుంటుందన్న ఆయన.. తన పాత్రలో నటించిన త్రిగుణ్ బాగా నటించాడని.. తన సతీమణి కొండా సురేఖ కంటే ఇర్రా మోర్ అందంగా ఉందని.. బాగా నటించారన్నారు.

ట్రైలర్ ను చూసిన కొండా సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. తాను జీవితంలో ఎంత బాద అనుభవించింది ట్రైలర్ చూసినప్పుడు గుర్తుకు వచ్చిందని.. ముఖ్యంగా కొండా మురళీ మీద కాల్పులు జరిపిన రోజును మాత్రం తాను మర్చిపోలేనని చెప్పారు. ఆ రోజును గుర్తు చేసుకున్న కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు జనవరి 26. నేను వెళ్లే సరికి మురళీగారు తెల్ల లాల్చీ పైజమాలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. నా కుమార్తె ఎక్కడ ఉందో కనిపించలేదు. ఆయన దగ్గరకు నన్ను వెళ్లనివ్వలేదు. చనిపోయారన్నారు. ఆ రోజు ఆయన మరణించి ఉంటే.. ఈ రోజు మేం ఎక్కడ ఉండేవాళ్లమో? అసలు మా పరిస్థితి ఏమిటో? ఆలోచించటానికే కష్టంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

దేవుడు తనకిచ్చిన పసుపు.. కుంకుమ బలం కొండా మురళీగారు మన ముందు ఉండటమన్న కొండా సురేఖ.. తమకు సంబంధించి వ్యక్తిగత విషయాన్ని వెల్లడించారు. ‘మా పుట్టిన రోజులు.. పెళ్లి రోజు.. పండుగలకు ఆయన కాళ్లు మొక్కుతా. ఈ మధ్యనే మొదటిసారి అడిగా.. కాళ్లు మొక్కినప్పుడు ఏమనుకుంటారని?.. దానికి కొండా మురళీ నీ తాళిబొట్టు గట్టిదని అనుకుంటాను’ అని చెప్పినట్లు వెల్లడించారు. రోటీన్ గా జరిగే సినిమా ట్రైలర్ లాంచింగ్ కు భిన్నంగా సినిమా విడుదల కావటం విశేషం. ఈ మూవీని మార్చిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.