Begin typing your search above and press return to search.

నిఘా నీడలో 50 వేల ఫోన్ నెంబర్లు.. మనోళ్లు ఇంకెవరంటే?

By:  Tupaki Desk   |   20 July 2021 4:20 AM GMT
నిఘా నీడలో 50 వేల ఫోన్ నెంబర్లు.. మనోళ్లు ఇంకెవరంటే?
X
దేశ వ్యాప్తంగా పెను రాజకీయ సంచలనంగా ‘ది వైర్’ కథనం మారింది. ఆదివారం తన మొదటి కథనాన్ని విడుదల చేసిన సదరు మీడియా సంస్థ.. తాజాగా మరిన్ని కథనాల్ని బయటకు తీసుకొచ్చింది. ఇందులో షాకింగ్ అంశాలతో పాటు.. రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించే ఉదంతాల్ని ప్రస్తావించింది. ఏదో ఆషామాషీగా తామీ కథనాన్ని బయట పెట్టలేదన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసేలా తన తాజా కథనాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ది వైర్.. తాజాగా తెర మీదకు తీసుకొచ్చిన హ్యాకింగ్ ఉదంతం ఇప్పుడు దేశ రాజకీయాల్ని మరో మలుపు తిప్పేలా ఉందన్న మాట వినిపిస్తోంది.

పెగాసస్ స్పైవేర్ తో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50 వేలకు పైగా నంబర్లను ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని చూస్తే.. జాబితాలోని వెయ్యికి పైగా నెంబర్లు యాభై దేశాల్లోని వ్యక్తులవిగా తేలింది. బాధితులుగా పేర్కొంటున్న వారిలో 189 మంది పాత్రికేయులు.. 600 మందికి పైగా రాజకీయ నేతలు.. 65 మంది వ్యాపారవేత్తలు.. 85 మంది మానవ హక్కుల కార్యకర్తలు.. పలువురు ప్రభుత్వాధినేతలతోపాటు.. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మొత్తం 50వేల ఫోన్ నెంబర్లలో దాదాపు 15 వేల నంబర్లు మెక్సికో వాసులకు సంబంధించినవిగా చెబుతున్నారు. పారిస్ కేంద్రంగా పని చేసే ఫర్బిడన్ స్టోరీస్ అనే ఎన్జీవో సంస్థ.. మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజా డేటాను సంపాదించి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థల్లో ఎంపిక చేసిన 16 వార్తా సంస్థలకు ఆ వివరాల్ని అందించటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

ఈ వ్యవహారాన్ని మీడియాకు అందించే ముందు ఆమ్నెస్టీ జాబితాలో ఉన్న 15 మంది జర్నలిస్టుల ఫోన్లను విశ్లేషించింది. వాటిల్లోకి పెగాసస్ చొరబడినట్లుగా తేల్చారు. అయితే.. భారత వ్యతిరేక కథనాల్ని వండటం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు మొదట్నించి అలవాటుగా బీజేపీ మండిపడుతోంది. గతంలోనూ అనేక భారత వ్యతిరేక కథనాల్ని బయటపెట్టటం ఈ సంస్థకు అలవాటు అంటూ కమలనాథులు కస్సుమంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను అవమానించటమే లక్ష్యమని.. ఏం చేసేందుకైనా కొంతమంది సిద్ధపడుతున్నట్లుగా అమిత్ షా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

పెగాసస్ జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్న మరికొందరు ప్రముఖుల పేర్లు ఏవంటే..

- బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు కమ్ ఎంపీ అభిషేక్ బెనర్జీ
- మాజీ చీఫ్ జస్టిస్ జస్టిస్ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగి
- సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగినితో పాటు.. ఆమె బంధువులకు చెందిన 11 నంబర్లు
- ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్) వ్యవస్థాపకులు జగదీప్ ఛోఖర్
- బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ భారతీయ విభాగం అధినేత హరి మేనన్
- గేట్స్ ఫౌండేషన్ కు చెందిన మరో ఉద్యోగి
- కేంద్రమంత్రిగా 2014-15లో ఉన్న స్మ్తతి ఇరానీ (ప్రస్తుతం కూడా ఆమె కేంద్రమంత్రిగా ఉన్నారు) వద్ద ఓఎస్డీగా వ్యవహరించిన సంజయ్ కచ్రూ
- విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా
- రాజస్థాన్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వసుంధరా రాజె వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన వ్యక్తి
- ప్రముఖ వైరాలజిస్టు గగన్ దీప్ కాంగ్
- బీజేపీకి చెందిన కొందరు జూనియర్ నాయకులు