ఉస్మానియా యూనివర్సిటీ చెట్ల మధ్యలో సమాధి? అసలేమైంది?

Mon Nov 29 2021 10:00:38 GMT+0530 (IST)

Tomb among Osmania University trees

షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన ఉస్మానియా వర్సిటీలోని చెట్ల మధ్య హటాత్తుగా ఒక సమాధి కనిపించిన వైనం తీవ్ర కలకలాన్ని రేపింది. చెట్ల మధ్య చేసిన ఈ సమాధితో అటువైపు వెళ్లిన వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అసలేమైందంటే..
ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలోని ఉస్మానియా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వెనకు ఉన్న అటవీ ప్రాంతంలో ఒక సమాధిని కనుగొన్నారు.ఆదివారం ఉదయం వాకింగ్ కు వెళ్లిన విద్యార్థులు.. చెట్ల మధ్యలో సమాధిని చూసి షాక్ తిన్నారు. తీవ్ర భయాందోళనలకు గురైన వారు.. హాస్టల్ కు పరుగులు తీశారు. తాము చూసిన విషయాన్ని అధికారులకు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఈసీహెచ్1 హాస్టల్ కు దగ్గరగా.. చెట్ల మధ్య ఇది ఉంది.

దానిపై తాజాగా సమాధి చేసినట్లుగా ఉండటంతోపాటు.. పూలను కూడా చల్లి ఉండటంతో అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే.. ఏదైనా జంతువును పూడ్చి పెట్టి ఉంటారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇటీవలే ఓయూలోకి బయట వ్యక్తులు రాకుండా ఉండేందుకు వీలుగా కొత్తగా సెక్యురిటీ గార్డులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయటంతెలిసిందే.
ఇలాంటివేళ.. సమాధి కనిపించటంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై ఓయూ అధికారుల్ని వివరణ అడగ్గా.. తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పటం విశేషం. ఉస్మానియా వర్సిటీ పోలీస్ స్టేషన్ కు సైతం ఈ ఉదంతానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు అందలేదు. విద్యార్థులు చూసిన విషయం మీడియా వారికి తెలిసినప్పుడు.. పోలీసులకు తెలీకపోవటం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమాధి లెక్క తేల్చాల్సిన అవసరం ఉందంటున్నారు.