Begin typing your search above and press return to search.

ఒలంపిక్స్ కు వైరస్ ఎమర్జెన్సీ దెబ్బ ?

By:  Tupaki Desk   |   31 July 2021 6:00 AM GMT
ఒలంపిక్స్ కు వైరస్ ఎమర్జెన్సీ దెబ్బ ?
X
కరోనా వైరస్ ప్రపంచాన్ని మళ్ళీ వణికించేస్తోంది. తీవ్రత తగ్గినట్లే తగ్గటంతో జనాలు మళ్ళీ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. చాలాదేశాలు లాక్ డౌన్ ఎత్తేయటంతో ప్రజలు రోజువారి పనుల కోసం స్వేచ్చగా రోడ్లపైన తిరిగేస్తున్నారు. అయితే తిరుగుతున్న జనాలు ఏమాత్రం ముందుజాగ్రత్తలు తీసుకోవటంలేదు. దాంతో వైరస్ మళ్ళీ విజృభించేస్తోంది. కరోనా వైరస్ సమస్య తగ్గిందన్న ఉద్దేశ్యంతోనే జపాన్ లో ఒలంపిక్స్ మొదలుపెట్టారు. ముందుజాగ్రత్తగా ఒలంపిక్స్ క్రీడలు జరిగే టోక్యోలో వైరస్ ఎమర్జెన్సీ విధించారు. అయితే ఏమాత్రం ఉపయోగం కనబడలేదు.

ఎందుకంటే ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారుల్లోనే సుమారు 130 మందికి కరోనా వైరస్ సోకటంతో వాళ్ళని క్వారంటైన్ లో పెట్టారు. తాజా లెక్కల ప్రకారం జపాన్లో కరోనా రెట్టించిన వేగంతో విజృంభిస్తోందట. టోక్యో సమీపంలోని ఒసాకా, ఒకినావా, సైతమా, కవగావా, చిబా నగరాల్లో వైరస్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధామనమంత్రి యొషిహిదే సుగా ప్రకటించారు. కేసుల తీవ్రత పెరిగిపోతున్న కారణంగానే ఎమర్జెన్సీ విధించినట్లు ప్రధాని ప్రకటించటం గమనార్హం. దాంతో ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆగష్టు 24 నుండి టోక్యోలనే పారా ఒలంపిక్స్ మొదలవ్వబోతోంది.

ఇక డ్రాగన్ దేశంలో కూడా ఇలాంటి పరిస్ధితులే కనబడుతున్నాయి. రాజధాని బీజింగ్ తో పాటు మరో 14 ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్ కేసులు స్పీడుగా పెరిగిపోతున్నాయట. చాలా నగరాల్లో, ప్రావిన్సుల్లో హెల్త్ ఎమర్జెన్సీని పెడుతున్నారు. అంతేకాకుండా కొన్ని నగరాల్లో అయితే జనాలను ఇళ్ళల్లోనే ఉండాలని స్ధానిక ప్రభుత్వాధికారులు నిషేధాజ్ఞలు విధించారు. తాజాగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటం ప్రభుత్వాలను టెన్షన్లో పడేస్తున్నాయి.

ఇక అమెరికాలో కూడా కేసుల తీవ్రత బాగా పెరిగిపోతోంది. శుక్రవారం ఒక్కరోజే దేశంలో 92 వేల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు కూడా 84 వేల కేసులు నమోదవ్వటంతో అగ్రరాజ్యంలో వణికిపోతోంది. ఫిబ్రవరి తర్వాత రోజులో ఇన్ని వేల కేసులు నమోదవ్వటం ఇదే మొదటిసారి. ఒకవైపు వైరస్ లో డాల్టా వేరియంట్ విజృభిస్తున్నా కోవిడ్ టీకాలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. అమెరికాలో 58 శాతంమంది జనాలు మాత్రమే టీకాలు వేయించుకున్నారట. చైనా జనాభాలో ఇప్పటికి 40 శాతం, జపాన్ జనాభాలో 27 శాతం మాత్రమే టీకాలు తీసుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనదేశంలో 47 కోట్లమంది టీకాలు వేయించుకున్నారు.