Begin typing your search above and press return to search.

స్వామివారి దర్శనానికి డేట్ ఫిక్స్ చేశారా?

By:  Tupaki Desk   |   31 May 2020 6:26 AM GMT
స్వామివారి దర్శనానికి డేట్ ఫిక్స్ చేశారా?
X
లాక్ డౌన్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల్ని అనుమతించని విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో నెలల తరబడి.. శ్రీవారి ఆలయం భక్తుల దర్శనానికి దూరంగా ఉండటం ఇదే తొలిసారి. నిత్యం వేలమంది స్వామివారి దర్శనం చేసుకునేవారు. దీనికి భిన్నంగా భక్తులు లేకపోవటంతో తిరుమల కొండ మొత్తం ఖాళీ అయిపోయింది. అక్కడ ఉండే కొద్దిమంది స్థానికులు మినహా మిగిలిన వారెవరూ లేని పరిస్థితి. దీంతో.. తిరుమల వ్యాప్తంగా ఇంతకు ముందెప్పుడూ చూడని కొత్త వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ 5.0కు సంబంధించి కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులోని థర్డ్ ఫేజ్ లో గుడులు తెరిచే వీలుంది. దీంతో.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం ఎప్పటి నుంచి తెరుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్ 8 నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తుల్ని అనుమతిస్తారని చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించే విషయంపై ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ.. జగన్ సర్కారు కానీ ఓకే అంటే.. భక్తులకు ఆన్ లైన్..కరెంటు బుకింగ్ కౌంటర్ల ద్వారా టైమ్ స్లాట్ టికెట్లను కేటాయించనున్నారు.

స్వామివారి దర్శనానికి వచ్చే వారంతా తప్పనిసరిగా మాస్కులు.. గ్లౌజులు ధరించాల్సి ఉంటుంది. అంతేకాదు.. తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడ్ని అలిపిరి తనిఖీ కేంద్రంలోనూ.. మెట్ల మార్గంలోనూ వైద్య పరీక్షలునిర్వహిస్తారు. అనంతరమే తిరుమలకు వెళ్లనిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా వందలాది మంది భక్తుల్ని తిరుమలకు అనుమతించరని చెబుతున్నారు. క్రమపద్దతిలో స్వామివారి దర్శనానికి అనుమతులు ఉంటాయని తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం తొలిదశలో స్వామివారి దర్శనానికి గంటకు కేవలం ఐదారు వందలకు మించి అనుమతించే అవకాశం లేదంటున్నారు. మరింత తక్కువ మందికే ఓకే చెప్పినా ఆశ్చర్యం లేదంటున్నారు. తొలుత తక్కువమంది భక్తుల్ని అనుమతించి.. ఈ విధానాన్ని సమీక్షించిన తర్వాతే నిబంధనల్ని సడలించే వీలుందని చెబుతున్నారు. ఏమైనా.. గతంలో మాదిరి స్వామివారి దర్శనం ఇప్పట్లో లేనట్లేనని చెప్పక తప్పదు.