కొత్త సెక్రటేరియెట్‌కు ముహూర్తం ఫిక్స్.. కేసీఆర్ నిర్ణయం ఇదే

Tue Nov 29 2022 15:03:06 GMT+0530 (India Standard Time)

Time to start a new secretariat.. This is KCR's decision

తెలంగాణలోని కేసీఆర్  ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇటీవలే సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ ఈ ఏడాది చివరి నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ స్వయంగా సచివాలయ ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేసారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి వచ్చే జనవరి 18న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆరోజున 6వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించి.. తన ఛాంబర్లో కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ రోజు నుంచి అక్కడే ప్రభుత్వ కార్యకలాపాలు సాగనున్నాయి.

ఈ గడువులోగా పనులన్నీ పూర్తిచేసి సర్వాంగసుందరంగా సచివాలయాన్ని సిద్ధం చేయాలని ఆయన అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఇటీవల సచివాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన సందర్భంగా.. పనులను వేగవంతం చేయాలని సంక్రాంతి తర్వాత ప్రారంభోత్సవం ఉంటుందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. జనవరి 18న మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజునే ప్రారంభోత్సవం జరపాలని సీఎం నిర్ణయించారు.

యుద్ధ ప్రాతిపదికన పనులు..రాష్ట్రంలో కొత్త సచివాలయ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు జరుగుతున్నాయి. భవనం అంతస్థులకు సంబంధించిన ప్రధాన కాంక్రీట్ పనులన్నీ కూడా గతంలోనే పూర్తయ్యాయి.

ప్రస్తుతం భవనం ముందుభాగం ఎలివేషన్ పనులతో పాటు భవనంపైన గోపురాల పనులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ దోల్‌పూర్ నుంచి తీసుకొచ్చిన ఎర్ర ఇసుకరాతితో ఫ్రంట్ ఎలివేషన్ పనులు చేస్తున్నారు.

ఈ పనుల కోసం రాజస్థాన్ నుంచే ప్రత్యేకంగా కూలీలను తీసుకొచ్చారు. ఇసుకరాయిని అవసరమైన నమూనాగా సిద్ధం చేసుకొని వాటిని అమర్చాల్సి ఉంటుంది. ఇందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని.. ఇప్పటికే చాలా భాగం పూర్తైనట్లు చెబుతున్నారు. అటు భవనం పైభాగాన ఆకర్షణీయంగా గుమ్మటాలను ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంపైన మొత్తం 34 గుమ్మటాలు రానున్నాయి. ఇవన్నీ కూడా వివిధ పరిమాణాల్లో ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.