Begin typing your search above and press return to search.

టిమ్ డేవిడ్.. ఆస్ట్రేలియాకు ఆడుతున్న ఇతడి ప్రత్యేకత తెలుసా?

By:  Tupaki Desk   |   23 Sep 2022 12:30 AM GMT
టిమ్ డేవిడ్.. ఆస్ట్రేలియాకు ఆడుతున్న ఇతడి ప్రత్యేకత తెలుసా?
X
క్రికెటర్లు ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడడం సహజమే. చరిత్రలో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఇలా చేశారు. కెప్లెర్ వెస్సెల్స్ దక్షిణాఫ్రికా కంటే ముందు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం
వహించాడు. ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్ కంటే తొలుత ఐర్లాండ్ కు ఆడాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ లో పుట్టి ఇంగ్లండ్ కు ఆడుతున్నాడు. కెవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికా నుంచి వెళ్లి ఇంగ్లండ్ మేటి బ్యాట్స్ మన్ గా నిలిచాడు.

ఇంకా చూస్తే ఎందరో ఇలాంటివారు రెండు దేశాలకు ఆడారు. వీరందరిలోకీ ప్రత్యేకం టిమ్ డేవిడ్. పైన చెప్పుకొన్న క్రికెటర్ల దేశాల్లో క్రికెట్ చాలా బాగా స్థిరపడింది. డేవిడ్ పరిస్థితి మాత్రం అది కాదు.

సింగపూర్ లో పుట్టి టిమ్ డేవిడ్ సొంత దేశం సింగపూర్. ఈ దేశం గురించి చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. చాలా చిన్నది. సరిగ్గా చెప్పాలంటే మన గ్రేటర్ హైదరాబాద్ కంట కాస్త ఎక్కువగా ఉంటుంది.అలాంటి దేశంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ జట్టు ఏర్పడడమే గొప్ప. అందులోనూ టిమ్ డేవిడ్ వంటి స్టార్ ఉండడం ఇంకా గొప్ప. డేవిడ్ ఎత్తు 6.5 అడుగులు. బహుశా ప్రస్తుతం బ్యాట్స్ మెన్ లో ఎవరూ ఇంత ఎత్తు లేరనుకుంటా. బౌలర్లలోనూ జేమిసన్, జన్ సేన్ , హోల్డర్ లాంటివారు తప్ప మిగతావారెవరూ ఇంతకంటే ఎత్తుండరు. అన్నిటికి మించి డేవిడ్ పవర్ ఫుల్ హిట్టర్.

అయితే, డేవిడ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. 2018-19లో కాంట్రాక్టు పొందాడు. కానీ, అనంతరం సింగపూర్ కు మారాడు. 2019 టి29 ప్రపంచ కప్ క్వాలిఫయర్ లోనూ ఆడాడు. దాని తర్వాత ఆసీస్ బిగ్ బాష్ లీగ్ కు ఎంపికయ్యాడు. 2020-21 సీజన్ నుంచి డేవిడ్ హవా మొదలైంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ సహా పలు లీగ్ లకు ఎంపికైన డేవిడ్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

ఐపీఎల్ లోనూ అదరగొట్టాడు..భారత ప్రీమియర్ లీగ్ లో తొలుత బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు డేవిడ్ ఆడాడు. అనంతరం గత సీజన్ లో ఇతడిని ముంబై ఇండియన్స్ రూ. 8.25 కోట్ల కు దక్కించుకుంది. కేవలం 86 బంతులు మాత్రమే ఎదుర్కొన్న టిమ్ డేవిడ్ అందులో 16 బంతులను సిక్స్ లుగా మలిచాడంటే అతడెంత పవర్ హిట్టరో అర్థం చేసుకోవచ్చు. 50 పైగా బంతులాడి.. ఒక సీజన్ లో అత్యధిక స్ట్రయిక్ రేట్ తో పరుగులు సాధించిన ఆటగాడిగా డేవిడ్ నిలిచిపోయాడు.

ఆసీస్ కు దొరికాడో ఆణిముత్యం వన్డే, టెస్టు క్రికెట్ లో బలమైన జట్టు అయినప్పటికీ టి20ల్లో మాత్రం ఆస్ట్రేలియా సాధారణ జట్టే. ఏదో గతేడాది కాలం కలిసివచ్చి ప్రపంచ కప్ అందుకుంది కానీ.. ఆసీస్ నిఖార్సయిన టి20 జట్టు ఏమీ కాదు.

అందుకనే ఆ జట్టు ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణలో పడింది. టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లకు పెద్ద పీట వేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అతడిని తమ జట్టులోకి తీసుకుంది. భారత్ తో మంగళవారం జరిగిని టి20లో డేవిడ్ అరంగ్రేటం చేశాడు. 16 పరుగులే చేసినప్పటికీ ఓ భారీ సిక్స్ తో అలరించాడు. మరో ఎండ్ లో చెలరేగుతున్న మాథ్యూ వేడ్ కు అండగా నిలిచి జట్టు గెలుపులో కీలకంగా నిలిచాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.