Begin typing your search above and press return to search.

అమలాపురం అల్లర్ల కేసుల్లో మరో ముగ్గురి అరెస్ట్‌.. 220కి చేరిన అరెస్టులు

By:  Tupaki Desk   |   26 Jun 2022 5:30 AM GMT
అమలాపురం అల్లర్ల కేసుల్లో మరో ముగ్గురి అరెస్ట్‌.. 220కి చేరిన అరెస్టులు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరును పెడుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ మే 24న అమ‌లాపురంలో అల్ల‌ర్లు, విధ్వంసం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసుల్లో తాజాగా పోలీసులు మ‌రో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో మొత్తం అరెస్టులు 220కి చేరాయి. విచార‌ణ‌కు ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేశారు. నిందితుల‌పై రౌడీషీట్లు మోప‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే మంత్రి విశ్వ‌రూప్, ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ ఇళ్ల‌ను, ప‌లు ప్రైవేటు, ఆర్టీసీ బ‌స్సుల‌ను, పోలీసు వాహ‌నాల‌ను ద‌హనం చేసిన‌వారి ఆస్తుల స్వాధీనానికి చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

కాగా తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిలో నిందితులు గాదె నాగ వెంకట బ్రహ్మ సతీష్‌ (అంబాజీపేట), పినపోతు మహేష్‌బాబు (గుండెపూడి), కె.సాయిరాజ్‌ (అమలాపురం)లను జూన్ 25న‌ శనివారం రాత్రి అరెస్ట్ చేశామ‌ని కోనసీమ జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ కేసుల్లో ఇప్పటివరకూ 220 మందిని అరెస్ట్ చేశారు. కోనసీమ జిల్లాలో ఇంకా 144 సెక్ష‌న్, పోలీస్‌ యాక్ట్ సెక్ష‌న్ 30 అమలులోనే ఉన్నాయి. ర్యాలీలు, సమావేశాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వ‌డం లేదు.

కాగా అమ‌లాపురంలో విధ్వంసం, అల్ల‌ర్లు చోటు చేసుకుని జూన్ 24కు నెల రోజులు పూర్త‌య్యాయి. మ‌రోవైపు మే 18 నుంచి జూన్ 18 వ‌ర‌కు కోన‌సీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం విధించిన గ‌డువు కూడా పూర్తియ్యింది. జిల్లా పేరు మార్పు అంశంపై ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు, సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించింది. కోన‌సీమ జిల్లాలోని 22 మండ‌లాల్లో ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు స్వీక‌రించారు. దాదాపు ఆరు వేల మంది అభిప్రాయాల‌ను జిల్లా అధికారులకు పంపిన‌ట్టు సమాచారం. అందులో ప్ర‌జ‌లు వివిధ అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో జూన్ 24న శుక్ర‌వారం జ‌రిగిన ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశంలో కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరును కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఇక ఆ జిల్లా పేరు కోన‌సీమ అంబేడ్క‌ర్ జిల్లాగా ఉండ‌నుంది.