బ్లాక్ ఫంగస్ తో కన్ను పోగొట్టుకున్న ముగ్గురు చిన్నారులు

Fri Jun 18 2021 17:00:01 GMT+0530 (IST)

Three little girls lost their eyesight with black fungus

చిన్నారులకు కరోనా కలిగించే ప్రమాదం తక్కువే కాని దాని వల్ల వచ్చే బ్లాక్ ఫంగస్ మాత్రం పిల్లలకు కూడా అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. కరోనా నుండి కోలుకుంటున్న వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు. కాని బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారు వెంటనే గుర్తించకుంటే పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు కరోనా కంటే ఎక్కువగా బ్లాక్ ఫంగస్ కు భయపడాలని.. లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వైధ్యులను సంప్రదించాలంటూ నిపుణులు చెబుతున్నారు. ముంబయిలో ముగ్గురు చిన్నారులు బ్లాక్ ఫంగస్ వల్ల వారి కళ్లను కోల్పోయారు. ఆపరేషన్ చేసి మరీ వారి కళ్లను వైధ్యులు తీయాల్సి వచ్చింది. కళ్లు కోల్పోయిన ఆ ముగ్గురు పిల్లలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నారు.ముంబయికి చెందిన 14 ఏళ్ల బాలికకు బ్లాక్ ఫంగస్ కారణంగా కన్ను తొలగించారు. ఆమెకు కరోనా లేకున్నా డయాబెటిస్ సమస్య ఉంది. కొన్ని రోజులుగా ఆమె కంటి సమస్యతో బాధ పడుతుంది. మొదట చిన్న సమస్యగా భావించి పట్టించుకోలేదు. కాని ఆ సమస్యం పెద్దది అవ్వడంతో ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షలు నిర్వహించి బ్లాక్ ఫంగస్ గా గుర్తించారు. వెంటనే ఆమెకు చికిత్స మొదలు పెట్టారు. కాని అప్పటికే ఆలస్యం అవ్వడం వల్ల ఆమె కన్ను 48 గంటల్లో నల్లగా మారిపోయింది. కన్ను నుండి ముక్కు వరకు ఫంగస్ చేరుకుంది. దాంతో ఆ బాలిక మెదడుకు కూడా బ్లాక్ ఫంగస్ చేరకుండా ఉండేందుకు ట్రీట్మెంట్ ఇచ్చామని.. ఆరు వారాల పాటు ట్రీట్ మెంట్ ఇచ్చినా కూడా ఫలితం లేకపోవడంతో చివరకు బాలిక కన్ను తొలగించాల్సి వచ్చిందని వైధ్యులు పేర్కొన్నారు.

మరో ఆసుపత్రిలో 4 మరియు 6 ఏళ్ల పిల్లలు కూడా బ్లాక్ ఫంగస్ కారణంగా వారి వారి కళ్లను పోగొట్టుకున్నారు. వారికి డయాబెటిస్ సమస్య లేదు కాని కరోనా బారిన పడ్డారు. ఆ కారణంగానే వారికి ఫంగస్ సోకింది. వారు ఇద్దరు కూడా ముంబయిలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్ ఈఎన్టీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారిని కాపాడేందుకు వైధ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా కూడా చివరకు వారి కన్ను తొలగించాల్సి వచ్చింది. వారి కన్ను తొలగించకుంటే ప్రాణాలకే ప్రమాదం అనే ఉద్దేశ్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చిందని వైధ్యులు పేర్కొన్నారు.

పిల్లలపై కరోనా ప్రభావం తక్కువ ఉంటుంది. కనుక వారి విషయంలో ఎక్కువ ఆందోళన అవసరం లేదని.. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కాని బ్లాక్ ఫంగస్ విషయంలో మాత్రం చిన్న పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన ఏ చిన్న అనారోగ్యం అయినా కూడా వెంటనే సంప్రదించాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.