బూతు సినిమా చూడలేదని ఆరేళ్ల పాపను రాళ్లతో కొట్టిన పదకొండేళ్ల బాలలు ముగ్గురు

Sat Oct 23 2021 08:00:02 GMT+0530 (IST)

Three children who killed a Kid

ఇలాంటి దారుణ విషయాలు వినాల్సి వస్తుందని.. రాయాల్సి వస్తుందని కూడా అస్సలు అనుకోలేదు. ఈ దారుణం గురించి తెలిసినంతనే మైండ్ మొత్తం బ్లాంక్ అయిన పరిస్థితి. ఏటువైపు పోతున్నాం? అసలేం జరుగుతోంది? ఎక్కడో ఏదో భయంకరమైన తేడా జరుగుతుంది. లేదంటే.. ఇలాంటి తేడా ఉదంతాలు చోటు చేసుకోవటమా? దీనికి కారణం ఎవరు? అన్నదిప్పుడు సమాధానం లేని ప్రశ్నలుగా మారాయి. పదకొండేళ్ల పిల్లలు అంటే.. మహా అయితే ఏడో తరగతి లేదంటే ఆరో తరగతి చదువుతుంటారు. అలాంటి పిల్లలకు బూతు సినిమాలు చూడాలన్న ఆలోచన రావటం ఒక ఎత్తు అయితే..తమతో పాటు ఆ సినిమాను ఆరేళ్ల చిన్నారికి చూపించాలనుకోవటం మరో షాకింగ్ నిజం.చివరకు తాము చెప్పినట్లుగా బూతు సినిమా చూసేందుకు సదరు చిన్నారి ససేమిరా అనటంతో.. కోపానికి పోయిన ముగ్గురు పిల్లలు ఆ చిన్నారిని రాళ్లతో కొట్టి చంపేసిన వైనం వింటే.. ఏమనాలి? ఎలా స్పందించాలన్నది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. అలు ఇలాంటి వైనాన్ని కలలో కూడా ఊహించలేం. చిన్నారుల మనసులు తీవ్రంగా కలుషితమైన వాతావరణం మన చుట్టుపక్కల అంతకంతకూ పెరుగుతుందన్న హెచ్చరిక తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

ఈ భయంకరమైన ఘటన అసోంలోని నగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని కలియబర్ పట్టణ పరిధిలోని మిస్సా గ్రమంలో 8 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్యనున్న ముగ్గురు బాలురు బూతు సినిమాల్ని చూడటానికి అలవాటు పడ్డారు. నిందితుల్లో ఇద్దరు పదకొండేళ్ల వయసు వారు అయితే.. మరొకరి వయసు ఎనిమిదేళ్లు మాత్రమే. ఆరేళ్ల చిన్నారి రాళ్ల గాయాలతో చనిపోయిన వైనాన్ని గుర్తించిన పోలీసులు.. రంగంలోకి దిగిన 24 గంటల్లో విషయాన్ని తేల్చేశారు. మిస్సాలోని ఒక క్వారీ వద్ద మరుగుదొడ్డిలో పాప శవాన్ని గుర్తించారు.

అసలేం జరిగిందన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నంలో పోలీసులకు షాకింగ్ నిజం బయటకు వచ్చింది. పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల కోసం ముగ్గురు నిందితుల్లో ఒకడి తండ్రి తన స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. అందులో మిగిలిన ఇద్దరు నిందితులు కలిసి నీలి చిత్రాలు చూడటం మొదలు పెట్టారు. ఆరేళ్ల చిన్నారిని బూతు సినిమాలు చూడాలని కోరితే.. ఆ పాప అందుకు నో చెప్పిందట. దీంతో.. ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు పిల్లలు రాళ్లతో ఆ చిన్నారిని చంపేశారు. నిందితుల్లోని ఒకడి తండ్రి మొబైల్ ను పరిశీలించగా.. అందులో అన్ని అశ్లీల వీడియోలే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇలాంటి దారుణ ఘటనలకు కారణం ఎక్కడ ఉందన్న విషయంతో పాటు.. చిన్నారుల మనసుల్ని విషం నింపటానికి తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.