Begin typing your search above and press return to search.

ఈసారి ఏపీ అసెంబ్లీలోకి ఆ మూడు ఛానళ్లకు ఎంట్రీ దక్కలేదు

By:  Tupaki Desk   |   10 Dec 2019 10:59 AM GMT
ఈసారి ఏపీ అసెంబ్లీలోకి ఆ మూడు ఛానళ్లకు ఎంట్రీ దక్కలేదు
X
ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కు మూడు మీడియా ఛానళ్లకు అనుమతి ఇవ్వకపోవటం ఆసక్తికరంగా మారింది. నిన్నటి (సోమవారం) నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు షురూ అయ్యాయి. గత అసెంబ్లీ సమావేశాల మాదిరే ఈసారి కూడా మూడు ఛానళ్ల(ఈటీవీ - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి - టీవీ5)కు ఎంట్రీ దక్కలేదు.

మూడు ఛానళ్లకు అసెంబ్లీ ఎంట్రీ పాసులు ఎందుకు దక్కలేదన్న విషయంపై అధికారులు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కు స్పీకర్ అనుమతి ఉండాలని..అలాంటిదేమీ రాకపోవటంతో అనుమతించలేదని చెబుతున్నారు.

దీంతో అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున.. ఈ రోజు (మంగళవారం) కూడా అసెంబ్లీలోకి అనుమతించలేదు. ఇదే విషయాన్ని బీఏసీ సమావేశాలో విపక్ష నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు లైవ్ ను ఆ మూడు ఛానళ్లకు ఎందుకు ఇవ్వలేదని అచ్చెన్న అడిగినట్లుగా తెలుస్తోంది. దీనికి బదులిచ్చిన సీఎం జగన్.. నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొన్నట్లు తెలిసింది.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక అనుమతి ఇవ్వకపోవటం సరికాదన్న మాటకు.. ఆ అంశాన్ని తాను పరిశీలిస్తానని అసెంబ్లీ స్పీకర్ చెప్పినట్లుగా తెలిసింది. మరి.. ఆ మూడు ఛానళ్లకు ఈ సెషన్లో అయినా అనుమతి లభిస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.