Begin typing your search above and press return to search.

కెప్టెన్.. చివరకు ఏమీ కాకుండా పోయాడు

By:  Tupaki Desk   |   16 Aug 2022 8:32 AM GMT
కెప్టెన్.. చివరకు ఏమీ కాకుండా పోయాడు
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించినది కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, బౌలింగ్ ఆల్ రౌండర్లు డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా. ఇటీవలి కాలంలో పేసర్ దీపక్ చాహర్ కూడా చెన్నైను గెలిపించాడు. వీరందరిలోనూ ధోనీ, రైనా, జడేజా. అయితే, ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తెగదెంపులైనట్లే కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో జడేజా, సీఎస్కే మేనేజ్ మెంట్ మధ్య ఎలాంటి మాటామంతీ లేదు. దీన్నిబట్టే జడేజా ఇక చెన్నైకు ఆడడనే అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి 2022 సీజన్ లో చెన్నై కెప్టెన్ జడేజానే. అయితే, అనూహ్యంగా కెప్టెన్సీ చేపట్టాక అతడి ఆటతీరు గాడితప్పింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ విఫలమయ్యాడు. దీంతో ఎటూ కాకుండా అవుతోందని సీఎస్కే మేనేజ్ మెంట్ జడేజాను తప్పించి మళ్లీ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి పగ్గాలు అందించింది.

రాక్ స్టార్ మనసు విరిగింది జడేజా ఐపీఎల్ కెరీర్ రాజస్థాన్ రాయల్స్ తో 2008 మొదలైంది. ఆ సీజన్ లో రాజస్థాన్ విజేతగా నిలవడంలో జడేజా పాత్ర కూడా ఉంది. అంతేగాక.. చెన్నైపై జరిగిన ఫైనల్లోనే రాజస్థాన్ గెలవడం గమనార్హం. తొలి సీజన్లో జడేజా 135 పరుగులు చేశాడు. 2009 సీజన్ లోనూ రాజస్థాన్ కే ఆడాడు. 295 పరుగులు చేశాడు. బౌలర్ గానూ ప్రతిభ చూపాడు. జడేజా ప్రదర్శనకు ముచ్చటపడిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అతడికి రాక్ స్టార్ అంటూ పేరు పెట్టాడు. కాబోయే సూపర్ స్టార్ అంటూ జోస్యం చెప్పాడు. సరిగ్గా ఇది నిజమైంది. ఇప్పుడు టీమిండియాలోని సూపర్ స్టార్ లలో జడేజా ఒకడు. బంతితో, బ్యాట్ తో ఐదేళ్లుగా అతడు అత్యంత నమ్మదగిన ఆటగాడిగా ఎదిగాడు. ఆ క్రమంలోనే ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్సీ దక్కింది.

కానీ, జడేజా సారథ్యం వహించిన తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింట్లో చెన్నై ఓడిపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన సీఎస్కే ఆరంభంలో ఎదురైన ఓటముల వల్లే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలను చేజార్చుకుంది. దీంతో జడేజాను సీఎస్కే కెప్టెన్ గా తప్పించింది. దీంతో అతడిలో ఫ్రాంఛైజీ పట్ల విముఖత ఏర్పడింది. పక్కటెముకల గాయం అంటూ ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

అంతేకాక సోషల్ మీడియాలో సీఎస్కే ను కొనియాడుతూ గతంలో చేసిన పోస్టులను తొలగించాడు. దీంతో సీఎస్కేకు అతడు దూరం అవుతున్నాడన్న వార్తలు వెలువడ్డాయి. దీనికి తోడు మేలో ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యంతో జడేజా దూరంగా ఉన్నాడు. కెప్టెన్‌ ధోని పుట్టినరోజు నాడు అభినందనలు తెలియజేస్తూ చెన్నై ఆటగాళ్లందరూ కలిసి చేసిన వీడియోలో జడ్డూ మాత్రమే లేడు. అంతేకాక ఆటగాళ్ల మధ్య బంధాన్ని దృఢపరచడానికి సీఎస్కే నిర్వహించే కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం జడేజా జట్టును వీడనున్నాడన్న వార్తలకు బలాన్ని అందిస్తోంది.

ఇక ఆడేది అనుమానమే..వచ్చే ఐపీఎల్‌లోనూ ఆడతానని ధోని గత సీజన్లోనే స్పష్టం చేశాడు. అతడు కెప్టెన్‌గానే జట్టును నడిపించనున్న నేపథ్యంలో జడేజా మళ్లీ జట్టులో చేరతాడా అనేది అనుమానంగా మారింది. ఐపీఎల్‌లో చెన్నై బలమైన శక్తిగా ఎదగడంలో కీలకపాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్‌ను సీఎస్కే గత సీజన్లో రూ.16 కోట్లు పెట్టి తిరిగి దక్కించుకుంది. అంతేకాక ధోని వారసుడిగా పరిగణిస్తూ అతడికి కెప్టెన్సీని కూడా అందించింది. కానీ ఆరంభ మ్యాచ్‌ల్లో జడేజా జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడు. పైగా వ్యక్తిగతంగానూ విఫలమయ్యాడు. ఈ సీజన్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 116 పరుగులే చేసిన జడ్డూ.. 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 2012 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లలో 156 మ్యాచ్‌లు ఆడాడు. ధోని (225), రైనా (200) తర్వాత ఈ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడింది జడేజానే కావడం గమనార్హం.

2010 తర్వతా గతేడాదే లీగ్ కు దూరంగా 2010 సీజన్లో జడేజా కాంట్రాక్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. దీంతో ఆ సీజన్ కు దూరమయ్యాడు. 2011లో కోచి టస్కర్స్ కు ఆడాడు. 2011లో ఆ జట్టు రద్దయ్యాక 2012లో చెన్నైకి వచ్చాడు. రూ.10కోట్లకు అతడిని చెన్నై కొనుక్కుంది. అప్పటినుంచి జడేజా దశ తిరిగింది. అదే ఏడాది టెస్టు అరంగేట్రం చేశాడు. మధ్యలో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత జడేజాకు ఎదురులేకుండా పోయింది. అయితే, 2022 సీజన్ అతడి గడ్డు కాలంగా మారింది. టీమిండియా తరఫున అద్భుతంగా రాణిస్తున్నా చెన్నైకి మాత్రం న్యాయం చేయలేకపోయాడు.

గుజరాత్ తీసుకోవడం ఖాయం సౌరాష్ట్ర (గుజరాత్) కు చెందిన జడేజా.. వచ్చే సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. సమతూకంతో ఉన్న గుజరాత్ జడేజా రాకతో మరింత బలోపేతం అవుతుంది. జడేజాను చేర్చుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, జడేజాలాంటి ఆటగాడిని వదులుకోవడం చెన్నైకు ఏమాత్రం సరికాదు. ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించగల జడేజాను విస్మరించడం వంటి తలతిక్క పని కూడా మరోటి లేనట్లే.