Begin typing your search above and press return to search.

వైసీపీ దెబ్బకి బాబు ప్రతిపక్ష హోదా ఊడిపోబోతుందా?

By:  Tupaki Desk   |   10 Dec 2019 8:24 AM GMT
వైసీపీ దెబ్బకి బాబు ప్రతిపక్ష హోదా ఊడిపోబోతుందా?
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాలో ఉన్నారు. కానీ , జరుగుతున్న పరిణామాలని ఒకసారి పరిశీలిస్తే ..అతి త్వరలో బాబు గారికి ఆ హోదా కూడా ఊడిపోయేలా కనిపిస్తుంది. తాజాగా సోమవారం నుండి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైయ్యాయి. మొదటి రోజే అధికార - విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. తొలిరోజే ఘాటుగా విమర్శలతో సభ దద్దరిల్లింది. ఇక నేడు రెండో రోజు సభ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఏపీలో పలువురు టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకునే వ్యూహాత్మక ఎత్తుగడ తో వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఒకవేళ అదే కనుక సాధ్యమైతే అసెంబ్లీలో టీడీపీ కి ప్రతిపక్ష హోదా గల్లంతు కావడం ఖాయమని చర్చ ప్రధానంగా జరుగుతుంది.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ..అష్టకష్టాలు పడి 23 సీట్లని గెలుచుకుంది. ప్రస్తుతం సభలో తెలుగుదేశం పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుండి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉన్నారు. సోమవారం సభ ప్రారంభానికి ముందు వంశీని టీడీఎల్పీ కార్యాలయంలోకి ఆహ్వానించినా ఆయన టిడిఎల్పి ఆఫీస్ లోకి వెళ్ళలేదు. ఆలాగే ఈ రోజు నేను టీడీపీ లో లేను అని - నన్ను ఒక స్వసంత్య్ర అభ్యర్థిగా గుర్తించి ..ప్రత్యేక స్థానం ఏర్పాటు చేయాలనీ స్పీకర్ ని వంశీ కోరారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసేలోగా టిడిపి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేస్తే టీడీపీని దెబ్బ కొట్టినట్టుగా ఉంటుందని వైసిపి నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. మొత్తం ఇప్పుడున్న 22 మంది సభ్యుల్లో ఆరుగురు సభ్యులు పార్టీ మారితే టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య 16కు పడిపోతుంది . ఆలా చేస్తే టిడిపి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు అవుతుంది. కేవలం 16 మంది సభ్యులు అంటే 10 శాతం కంటే తక్కువ కావడంతో ప్రతిపక్ష హోదా గల్లంతు అవుతుందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా అని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సాధారణ ఫ్లోర్ లీడర్ స్థాయికి చంద్రబాబు హోదా పడిపోతుంది. ఇప్పటికే టీడీపీ లో నుండి వైసీపీ లోకి రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నప్పటికీ .. పార్టీ ఫిరాయించిన నేతలు ఎవరైనా పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ ఒక కండిషన్ పెట్టడాంతో అందరూ సందిగ్ధం లో పడ్డారు. ఆ ఒక్క నిబంధన లేకపోతే టీడీపీ ఎప్పుడో ఖాళీ అయ్యేదని చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ..బాబు కి బిగ్ షాక్ ఇవ్వాలని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే బాబు కి అంత కంటే మరో ఘోర అవమానం ఇంకొకటి ఉండదు.