వైసీపీలోకి తోట..మరో ఇద్దరు ‘తూర్పు‘ తమ్ముళ్లు కూడానట!

Thu Sep 12 2019 21:49:02 GMT+0530 (IST)

Thota Trimurthulu in YSRCP

ఏపీలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీకి వరుస దెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీని వీడగా... ఇప్పుడు మరో ముగ్గురు కీలక నేతలు పార్టీకి హ్యాండిచ్చేందుకు సిద్ధమైపోయారు. ఈ ముగ్గురు పార్టీని వీడితే... రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలక జిల్లాగా పరిగణిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఈ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త టీడీపీలో కీలక నేతగానే కాకుండా కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న తోట త్రిమూర్తులు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారట. తోటతో పాటు ఇదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారనున్నారట. వీరంతా పార్టీ వీడటం ఓ ఎత్తైతే... వీరంతా కూడా టీడీపీని చావుదెబ్బ కొట్టిన వైసీపీలోకి చేరుతుండటం మరో ఎత్తుగా చెప్పాలి.ఎన్నికలకు ముందే తోట త్రిమూర్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరతారని ప్రచారం సాగినా... అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలు కావడం తోటకు పార్టీ అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న వాదనలతో ఆయన పార్టీ అదిష్ఠానానికి దూరం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నామధ్య కాపు నేతలతో తోట భేటీ టీడీపీలో కలకలమే రేపింంది. అయితే అప్పుడు కేవలం ఎన్నికల తదనంతర పరిస్థితులపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని చెప్పిన తోట... ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే తాజాగా మొన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు చంద్రబాబు వెళితే... తోట ఆయనతో కలిసేందుకే ఇష్టపడలేదట. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతానని చంద్రబాబు చెప్పినా... చంద్రబాబే స్వయంగా మాట్లాడతారని సమాచారం ఉన్నా కూడా తోట పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తోట పార్టీ మారడం ఖాయమేనని నిర్ధారించుకున్న చంద్రబాబు... ఒకరిద్దరు పార్టీని వీడినా పెద్దగా నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం ప్రకారం చంద్రబాబుతో భేటీని బాయికాట్ చేసిన తర్వాత తోట తన అనుచరవర్గంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారట. తాను పార్టీ మారుతున్నానని - వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నానని చెప్పారట. దీనికి కార్యకర్తలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని - ఈ నెల 18న ఆయన వైసీపీలో చేరిపోతున్నారని తెలుస్తోంది. వైసీపీతో పాటు బీజేపీ నుంచి కూడా ఆహ్వానమున్నా... వైసీపీలో చేరేందుకే తోట నిర్ణయించుకున్నారట. పార్టీలోకి చేరిన తర్వాత ఓ కీలక పదవితో పాటు జిల్లాలో మరింత కీలక బాధ్యతలు అప్పగిస్తామని వైసీపీ చేసిన ఆపర్ తోనే తోట వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి తోట చేరికపై ఇప్పటికే పార్టీ అదినేత - సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... తోటతో పాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. ఇదే జరిగితే... రాజకీయంగా కీలకమైన జిల్లాలో టీడీపీ జీరోగానే మారే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.