Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ రెండు కులాలను కలిపితే...?

By:  Tupaki Desk   |   16 Oct 2021 1:30 AM GMT
ఏపీలో ఆ రెండు కులాలను కలిపితే...?
X
వచ్చే ఎన్నికలకు టైమ్ చాలానే ఉంది. అయితే హడావుడి మాత్రం ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఆదికి ముందే నేతాశ్రీలు పార్టీలు జోరు పెంచుతున్నారు. దాన్ని ముందు జాగ్రత్త అనాలో లేక వ్యూహాత్మకమని భావించాలో తెలియదు కానీ రాజకీయ వేడి మాత్రం ఏపీలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉంది. ఒక విధంగా పొలిటికల్ సమ్మర్ హీట్ గా దీన్ని చూడాలి. ఏపీలో కులాలే ప్రధానం అన్నది వాస్తవం. ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఎన్ని సీట్లు ఇస్తే గెలుపు పిలుపు అందుకుంటామన్నది రాజకీయ పార్టీల అధినేతలకు కంఠోపాఠమే. నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా ఈ కులాల లెక్కలు కూడికలు, తీసివేతల గురించి రాజకీయ పార్టీలు చర్చించుకుంటూనే ఉన్నాయి. తమ వ్యూహాలలో కులాలను భాగం కూడా చేసేశాయి.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ని గద్దె దించేయాల్సిందే. ఇది టీడీపీ పట్టిన శపధం. కాస్తా అటు ఇటుగా ఇదే మాట జనసేన కూడా అంటోంది. పవన్ కళ్యాణ్ కి ప్రధాన శత్రువు, ఆ మాటకు వస్తే ఏకైక శత్రువు కూడా వైసీపీయే అనుకోవాలి. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానీయను అని 2019 ఎన్నికల వేళ పవన్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అయితే నాడు జగన్ కి ఉన్న ఊపులో క్రేజులో అది వర్కౌట్ కాలేదు. అయితే ఇపుడు జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన మీద ఎంతో కొంత వ్యతిరేకత జనంలో ఉండవచ్చు. దాంతో ఇపుడు గట్టిగా పట్టుబడితే టాస్క్ కొంత ఈజీయే అని జనసేనాని భావిస్తున్నారుట.

సరే విడిగా అటు టీడీపీ ఇటు జనసేన ఎంత భావించినా ఎన్ని ఊహించినా కూడా జగన్ అనే బలమైన నేతను ఢీ కొనడం కష్టమే. అందుకే ఇపుడు ఈ ఇద్దరు మధ్యన పొత్తు కుదరాలని రెండు పార్టీలలోని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. ఈ రాజకీయ పొత్తుల ఎత్తులు ఎలా ఉన్నా కమ్మ కాపు సామాజిక వర్గాలను కలిపేలా ఒక చక్కని సామాజిక వేదికను రూపొందించాలన్న మాట కూడా వస్తోంది. ప్రధానంగా సినీ వర్గాల నుంచి అది వస్తోంది. ఈ రెండు సామాజిక వర్గాల్లో ఉన్న వారిలో మెజారిటీ లైక్ మైండెడ్ గానే ఉంటున్నారు. అటు సినీ రంగాన ఇటు రాజకీయ రంగాన కూడా కలసి పనిచేసే వారు కూడా ఉన్నారు.

దాంతో ఈ రెండు సామాజిక వర్గాలను విశాల ప్రయోజనాల రిత్యా ఏకం చేస్తే ఏపీ రాజకీయాల గతిని మార్చవచ్చునని కోరుకునే సినీ పెద్దలు కూడా ఉన్నారు. వీరిలో కొందమంది సినీ పెద్దలు అయితే మీడియా మొఘల్ అని పేరున్న ఒక పత్రికాధిపతిని ఆశ్రయించారని కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఆయనకు ఏపీ రాజకీయాల మీద మంచి పట్టుంది. ఉమ్మడి ఏపీలో రాజకీయాలను మార్చిన ఘన‌మైన చరిత్ర కూడా ఆయనకు ఉంది. ప్రజల మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకుని తనదైన పద్ధతిలో మీడియా ద్వారా ఎప్పటికపుడు పొలిటికల్ ఆల్టర్నేషన్ ని క్రియేట్ చేయడంలో ఆయన స్పెషలిస్ట్ అని కూడా చెబుతారు మరి ఆ పెద్దాయన కనుక పూనుకుంటే రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య ఐక్యత సాధ్యమే అంటున్నారు. అటూ ఇటూ అందరితోనూ విశేష పరిచయాలు ఉన్న ఆయన తలచుకుంటే ఏపీ రాజకీయ ముఖ చిత్రమే మారుతుందని విశ్వసించే వారున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ తప్పదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఆ పెద్దాయన ఒప్పుకుంటారా, ఆయన మునుపటిలా దూకుడుగా ఇలాంటి సరికొత్త సామాజిక‌ కలయికలకు వేదిక అవుతారా అన్నది వేచి చూడాలి.