Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలకు ఆ ఇద్దరే ఫ్యూచర్ అధినేతలు.. అలా ఎలానంటే?

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:13 AM GMT
తెలుగు రాష్ట్రాలకు ఆ ఇద్దరే ఫ్యూచర్ అధినేతలు.. అలా ఎలానంటే?
X
దాదాపు ఐదేళ్ల క్రితం హైదరాబాద్ మహానగరంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. దీన్ని జాతీయ మీడియా మాత్రమే కాదు.. అంతర్జాతీయ మీడియా సైతం అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అదే.. జీఈఎస్. అదేనండి అంతర్జాతీయ పారిశ్రామివేత్తల సదస్సు. దీని ప్రత్యేకత ఏమంటే.. నాటి సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హాజరయ్యారు. ఆ మాటకు వస్తే ఆమె మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా 1500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అలా హాజరైన వారిలో బ్రిటన్ నాటి ప్రధాని సతీమణితో పాటు.. పలువురు వీవీఐపీలు.. పేరున్న మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఒక చర్చాగోష్ఠిని నిర్వహించారు. అందులో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రముఖ..పారిశ్రామికరంగంలో పవర్ ఫుల్ మహిళలుగా పేరున్న వారు హాజరయ్యారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ప్రముఖల ముందు కూర్చున్న కేటీఆర్.. సదరు చర్చాగోష్ఠిలో ఆయన తేలిపోతారని పలువురు భావించారు. అందుకు భిన్నంగా ఆయన తన మాటలతో.. సమర్థతతో అందరిని ఆశ్చర్యపోయేలా చేయటమే కాదు.. అంచనాలకు మించి ఆకట్టుకొన్నారు.

ఆ సందర్భంగా ఆయన మాటలకు.. బాడీ లాంగ్వేజ్ కు.. ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వైనం చూసిన వారు కేటీఆర్ సమర్థతకు మురిపోయారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక సమర్థుడైన యువ నేత ఉన్నారన్న భావన కలిగింది. రాజకీయాన్ని గల్లీలో ఉండే లీడరు కూడా చేస్తారు. కానీ.. ఇలా ఒక అంతర్జాతీయ సదస్సులో అక్కడి ప్రముఖులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో కేటీఆర్ తన సమర్థను చాటి చెప్పుకున్నారు.

కట్ చేస్తే.. శనివారం హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. (చార్టెడ్ అకౌంటెంట్)స్టూడెంట్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు భారత్ తో పాటు.. శ్రీలంక.. బంగ్లాదేశ్ కు చెందిన విద్యార్థులతో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వందలాదిగా హాజరైన వీరిలో అత్యధికులు మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

చేతిలో ఎలాంటి అధికారం లేకపోవటమే కాదు చివరకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవని అధినేతగా పవన్ అపకీర్తిని మూటగట్టుకున్నారు. కానీ.. అలాంటి పరిస్థితికి కారణం ఆయన నమ్మిన సిద్ధాంతం.. రాజకీయాల్లో మార్పు రావాలన్న తన మాటను తప్పకుండా.. ఎన్నికల వేళ డబ్బు పంచటం.. మద్యాన్ని సరఫరా చేయటానికి ససేమిరా అంటూ.. అలాంటివేమీ చేయకపోతే ఓడిపోయేందుకు సైతం సిద్ధమన్న పవన్.. అందుకు తగ్గట్లే ఓటమి పాలయ్యారు. కానీ.. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.

బ్యాడ్ లక్ ఏమంటే.. పవన్ కల్యాణ్ నిజాయితీ.. తాను చెప్పే ఆదర్శాల్ని చేతల్లో చూపించి ఓటమి పాలయ్యారన్న సత్యాన్ని ప్రధాన మీడియా ప్రస్తావించలేదు. పవన్ కల్యాణ్ చెప్పుకోలేదు. ఓడిపోయానంటే ఓడిపోయాను.. ప్రజలు తిరస్కరించారన్న మాట మీదే నిలబడ్డారు కానీ.. దానికి కారణం ఫలానా అని చెప్పుకోవటానికి ఇష్టపడలేదు. కట్ చేస్తే.. చార్టెడ్ అకౌంట్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాన్నిశ్రద్ధగా విన్నప్పుడు పవన్ లో విషయాల మీద అవగాహన ఎంతన్న విషయంతోపాటు.. భాష మీద తనకున్న కమాండ్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

అన్నింటికి మించి తాను చెప్పే మాటలు ప్లాస్టిక్ మాటలు మాదిరిలా కాకుండా గుండెల్లో నుంచి వచ్చేవి అన్నట్లుగా ఉండటం అందరిని ఆకర్షించే అంశం.

కేటీఆర్ కానీ పవన్ కల్యాణ్ కానీ రాజకీయం చేయటం లేదని ఇక్కడ చెప్పటం లేదు. రాజకీయంగా ఎలా ఉన్నా.. రాజకీయాలకు అతీతంగా ఏదైనా కీలక విషయాలకు వెళ్లినప్పుడు వారికి ఉన్న అవగాహన.. విషయాల మీద ఉన్న పట్టు ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. వేదిక ఏదైనా.. వారి కారణంగా మరింత వన్నె తెచ్చేలా ఉండటమే తప్పించి.. వారు తేలిపోయేలా ఉండటం కనిపించదు. అదే ఈ ఇద్దరి నేతల్లో ప్రత్యేకతగా చెప్పాలి.

ఇదంతా చూసినప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్.. కేటీఆర్ లు భవిష్యత్తు నేతలుగా కనిపించటం ఖాయం. అవసరానికి తగ్గట్లు అడ్డదిడ్డంగా మాట్లాడటం.. అదే సమయంలో అర్థవంతంగా మాట్లాడటంలో తమకున్న పట్టు ఈ ఇద్దరు ముఖ్యనేతల్లోనే కనిపిస్తుందని చెప్పాలి. ఇలాంటి విజన్ ఉన్న నాయకులతో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఆశాజ్యోతులుగా చెప్పాలి. ఈ కోణంలో చూసినప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో మరే నేత కూడా వీరి దరిదాపుల్లోకి వచ్చినట్లుగా కనిపించరు.