Begin typing your search above and press return to search.

దక్షిణాఫ్రికా పర్యటనకు ఆ నలుగురు దూరం

By:  Tupaki Desk   |   8 Dec 2021 2:30 PM GMT
దక్షిణాఫ్రికా పర్యటనకు ఆ నలుగురు దూరం
X
ఒమైక్రాన్ వేరియంట్ ఉద్భవం నేపథ్యంలో ఆగుతుందా? సాగుతుందా? అన్నట్లుండి.. చివరకు నిర్వహణకు ఓకే వచ్చిన దక్షిణాఫ్రికా పర్యటనకు నలుగురు టీమిండియా క్రికెటర్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్, స్పిన్నర్ అక్షర్ పటేల్, పేసర్ ఇషాంత్ శర్మ ఉన్నారు.

మిగతా అందరి సంగతి ఎలా ఉన్నా జడేజా దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బే. ఇషాంత్ కు దక్షిణాఫ్రికా వెళ్లే జట్టులో అసలు చోటు కష్టమే అని స్పష్టంగా తెలిసిపోతోంది. అతడు ఫిట్ గా ఉన్నా తీసుకోరని స్పష్టమైపోతోంది. ఇక గిల్ కీలక ఆటగాడే అయినా అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.

ఓపెనర్ కేఎల్ రాహుల్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తుండడంతో గిల్ లేకపోయినా ఏమీ పెద్ద ప్రభావం ఉండదు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ఉన్నాడు. మరోవైపు సిరీస్ లో గిల్ ను ఓపెనర్ గా కాకుండా మిడిలార్డర్ లో పంపే ఆలోచనలో ఉన్నది టీమిండియా మేనేజ్ మెంట్. ఇప్పడు ఎలాగూ గిల్ అందుబాటులో లేకుండా పోయాడు.

ముంబై టెస్టులో గిల్‌ మధ్య వేలికి గాయమైంది. అక్షర్ మంచి బౌలరే. బ్యాట్ తోనూ సత్తా చాటుతున్నాడు. అయితే, దక్షిణాఫ్రికా లో పేసర్లు ఎక్కువ అవసరం కానీ, స్పిన్నర్లతో పెద్ద గా పని ఉండదు. కాకపోతే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అక్షర్ అవసరం పడొచ్చు. ఇప్పటికైతే జడేజా సిరీస్ మొత్తానికి దూరమవుతాడా? టెస్టుల వరకేనా? అన్నది తేలాల్సి ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్ లకూ జడేజా అందుబాటులో లేకుంటే జట్టుకు లోటే.

రకరకాల గాయాలు

ఈ నలుగురు ఆటగాళ్లు రకరకాల గాయాలతో బాధపడుతున్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కాన్పూర్‌ మ్యాచ్‌లో జడేజా కుడి ముంజేతికి గాయమైంది. వైద్య పరీక్షలు నిర్వహించారు. ముంజేయి వాపు కారణంగా జడేజా ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఒకవేళ జడేజా సర్జరీకి వెళ్లాల్సి వస్తే అతడు సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న అక్షర్‌ పటేల్‌ సైతం స్ట్రెస్‌ రియాక్షన్‌(కీళ్ల నొప్పి) కారణంగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం అతడు దక్షిణాఫ్రికా టూర్‌కు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయం తేలనుంది.


మరోవైపు సీనియర్‌ సీమర్‌ ఇషాంత్‌ శర్మ పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్నాడు. ఇతడి స్థానంలో ముంబై టెస్టుతో జట్టులోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ అందుబాటులో ఉన్నాడు. తన పదునైన బంతులతో ఈ మ్యాచ్ లో సిరాజ్ ప్రతిభ చాటాడు కూడా. కాబట్టి ఇషాంత్ దూరమైనా పెద్దగా సమస్యకాకపోవచ్చు.

జడేజా, అక్షర్‌ పటేల్‌ టూర్‌ మిస్‌ అయితే. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు తోడుగా.. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో అనధికార టెస్టులు ఆడుతున్న ఇండియా ఏ జట్టులోని షాబాజ్‌ నదీం, సౌరభ్‌ కుమార్‌ను అక్కడే ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించే అవకాశం ఉంది. జట్టు ఎంపిక ఆలస్యం

దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఎంపిక బుధవారం జరగాల్సి ఉంది. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలను జట్టులో కొనసాగిస్తారా? లేదా? అన్నది తేలిపోనుంది. దీనిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుజారా, రహానేలకు ఒక్క చాన్స్ ఇస్తారని కొందరు, లేదు లేదు.. ఇప్పటికే అనేక చాన్స్లులు ఇచ్చారని వారిద్దరూ నిలుపుకోలేకపోయారని మరికొందరు వాదిస్తున్నారు. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ బుధవారం ఎంపిక ప్రక్రియ జరగనుండగా.. నలుగురు ఆటగాళ్ల గాయం వెలుగులోకి వచ్చింది.

ఈ కారణంగా జట్టు ఎంపిక కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న ఈ సిరీస్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది.