ఆ మూడు సెక్షన్లే టీడీపీని అధికారంలోకి తెస్తాయట...?

Tue Aug 16 2022 13:04:13 GMT+0530 (IST)

Those Three Sections will Bring TDP to Power

రాజకీయ పార్టీలకు కొన్ని లెక్కలు ఉంటాయి. అంచనాలు కూడా ఉంటాయి. అయితే ఎన్నికలు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి. సమీకరణల్లో కూడా తేడా ఉంటుంది. సాధారణ ఎన్నికలకు మరో సాధారణ ఎన్నికలకు మధ్య అతి భారీ వ్యత్యాసం ఉంటుంది. తాము గతంలో చేసిన తప్పులను రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో సమీక్షించుకుంటేనే మేలు అని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉన్న తెలుగుదేశం పార్టీ చాలానే జాగ్రత్తలు తీసుకుంటుంది.



తెలుగుదేశానికి తన బలాలూ బలహీనతలు చాలా బాగానే తెలుసు. కానీ బలహీనతలలో  కొన్నింటికి ఆ పార్టీ వదులుకోవడానికి ఏ కోశానా  ఇష్టపడదు అలాగే మరికొన్ని తెలుగుదేశంతోనే అలా కొనసాగుతాయి. అది అనివార్యం అని చెప్పకతప్పదు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయ ముఖ చిత్రం మీద ఈ రోజుకీ ఎవరికీ పూర్తి స్థాయి అంచనా లేదు. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉంది. మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అంటూ వస్తున్న సర్వేలు జస్ట్ ఒపీనియన్స్ కలెక్ట్ చేస్తున్నాయి తప్ప పూర్తి స్థాయి మనోగతాన్ని కాదు.

అయినా ఇవాళ ఉన్న భావన రెండేళ్ళ తరువాత ఇలాగే ఉంటుంది అని కూడా ఎవరూ చెప్పలేని స్థితి. ఇదిలా ఉంటే స్థూలంగా చెప్పుకోవాలీ అంటే కొన్ని అంచనాలు ఉన్నాయి. ఏపీలో అధికార వైసీపీ పెద్ద ఎత్తున సంక్షేమ కర్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శించినా లబ్ది అందుకుంటున్న వారు మాత్రం హ్యాపీగానే ఉంటారు. వారికి ఇవ్వాల్సింది ఇస్తున్నపుడు నొప్పి ఎందుకు ఉంటుంది.

అయితే ఏపీలో అభివృద్ధి లేదు అన్నది కీలకమైన పాయింట్. దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే ఈ చర్చ అంతా ఎక్కడ ఉందీ అంటే ఉన్నత వర్గాలు మధ్యతరగతి చదువుకున్న వారిలో బలంగా ఉంది అని చెప్పాలి. అలాగే ఏ పార్టీకి చెందనివారు తటస్థులలో కూడా ఇలాంటి చర్చ ఉంది. ఇపుడు చూస్తే వైసీపీ యాంటీ ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే ఈ సెక్షన్లలో గట్టిగానే ఉంది అని చెప్పాలి.

ఇక పేద వర్గాలు గ్రామీణులలో మాత్రం వైసీపీ పట్ల సానుకూలత ఉంది. అదే సర్వేలలో ఎంతో కొంత ప్రతిబింబిస్తోంది. దాంతోనే ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి. కానీ ఈ దిగువ సెక్షన్లకు పక్కన పెడితే మిగిలిన వారంతా యాంటీగా ఉన్నారు అన్న నిజం మాత్రం సర్వేలలో ప్రతిబించడంలేదు. ఇక ఇపుడు ఈ సెక్షన్లనే టీడీపీ గట్టిగా పట్టుకుంటోంది. సర్వేలలో పెద్దగా పట్టింపునకు రాని ఈ సెక్షన్లలో చాలా మంది పోలింగునకు కూడా రారు.

ఉన్నత వర్గాలు పోలింగ్ బూతుల వైపు అసలు తొంగి చూడరు అన్న బలమైన భావన అంతటా ఉంది. అలాగే మధ్యతరగతి వర్గాలలో కూడా హెచ్చు మంది  గైర్ హాజరవుతూంటారు. ఇక న్యూట్రల్ వర్గాలకు ఏ రాయి అయితేనేమి పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని ఆలోచిస్తూ రాజకీయ  వేదాంతం చూపిస్తారు. ఇలా ఈ మూడు వర్గాలు ఓటింగ్ ని ప్రభావితం చేయరనే సర్వేశ్వరులు వీరి జోలికి రారు. కానీ వీరు తలచుకుంటే మాత్రం ఏకంగా ఫలితాలనే తారుమారు చేయగలరు.

వీరు బయటకు రావాలీ అంటే చాలా పెద్ద మార్పు కోసం అన్న భావన వారిలో ఉండాలి అన్న మాట. ఏపీలో మళ్లీ వైసీపీ వస్తే కచ్చితంగా రాష్ట్రం ఇబ్బందులో పడుతుంది అన్న భావన వారిలో ఉంది కానీ అది ఉద్యమ స్థాయిలో  అయితే లేదు. దాన్ని రాజేసే ప్రయత్నంలోనే టీడీపీ ఇపుడు గట్టిగా శ్రమిస్తోంది. ఈసారి కనుక వైసీపీ చేతికి అధికారం వస్తే ఏపీ గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు మాట్లాడాల్సిన పనే లేదు అని టీడీపీ చేస్తున్న ప్రచారం వీరి గురించే. ఈ సెక్షన్లు ముందు పోలింగ్ బూతులకు కదిలితే కనుక కచ్చితంగా వైసీపీ సర్కార్ కి అది డేంజర్ బెల్స్ గా చూడాలన్న మాట.

సాధారణంగా పోలింగ్ తక్కువ జరిగితే అధికార పక్షానికి లాభం. వైసీపీ నమ్ముకున్న దిగువ సెక్షన్లు ఠంచనుగా పోలింగులో పాల్గొంటాయి. అయితే టీడీపీ ఆశపడుతున్న సెక్షన్లు కూడా పోలింగ్ బూతులకు కదలివస్తే కనుక భారీ పోలింగ్ 2024లో ఏపీలో జరుగుతుంది. అలా కనుక జరిగితే అది కచ్చితంగా అధికార మార్పిడికే అని అర్ధం చేసుకోవాల్సిందే. మరి ఏపీలో తెల్లారిలేస్తే జగన్ సర్కార్ ని విమర్శిస్తూ కూర్చున్న వర్గాలు ఎన్నికల్ వేళ క్యూ లైన్లలో నిలబడి యాంటీగా ఓట్లు వేస్తాయా. వేస్తారు. వేయాలీ అని టీడీపీ అంటోంది. అదే జరిగితే టీడీపీదే ఏపీ పీఠం అని చెప్పుకోవచ్చు.