ఈ మహిళకు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట .. అసలేమైంది ?

Sat Jan 23 2021 16:28:19 GMT+0530 (IST)

This woman has been infected with the corona 31 times

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగిపోతుంది. జనవరి 16న మొదలైన టీకాల పంపిణీకి శుక్రవారంతో వారం రోజులు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం వారంలోనే దాదాపు 14 లక్షల మందికి టీకాలు వేశారు. ఈ నేపథ్యంలోనే ఓ వార్త దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేస్తోంది. సాధారణంగా కరోనా సోకిన వ్యక్తిలో యాంటీబాడీలు తయారవుతాయనీ కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తికి కరోనా అంత ఈజీగ సోకదనీ అప్పట్లో వార్తలు వచ్చాయి. వైద్యులు వాటిని నిర్ధారించకపోయినా ఒక్కసారి కరోనా సోకిన వారికి మళ్లీ వచ్చిన ఉదంతాలయితే లేవు. కానీ రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళకు ఏకంగా 31 సార్లు కరోనా సోకింది.వైద్యులు టెస్ట్ చేసిన ప్రతీసారి ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఇది కాస్తా రాజస్థాన్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ పరిధిలో 35ఏళ్ల మహిళకు 31సార్లు కరోనా సోకినట్టు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం ఆర్బీఎం ఆస్పత్రిలో ఉన్న ఆమె ఆప్నాఘర్ ఆశ్రమంలో ఉంటోంది. గడిచిన ఐదు నెలల్లో 31 సార్లు ఆమె నమూనాలను పరీక్షించినట్టు వైద్యులు వెల్లడించారు. వీటిల్లో 17 ఆర్టీపీసీఆర్ టెస్టులు కాగా 14 ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులనీ చెబుతున్నారు. హోమియోపతీ అల్లోపతీ వంటి అన్నిరకాల వైద్యాలను అనుసరించి ఆమెకు ట్రీట్ మెంట్ ఇచ్చినా టెస్ట్ చేసిన ప్రతీసారి ఆమెకు పాజిటివ్ అనే రిపోర్టులో వస్తోందని వైద్యులు ప్రకటించారు.

వాస్తవానికి కరోనా సోకిన వాళ్లకు కాస్త బలహీనతకు గురవుతారనీ కానీ విచిత్రంగా ఆ మహిళ 7 నుంచి 8 కిలోల బరువు పెరిగిందని వైద్యులు బీఎం భరత్వాజ్ చెప్పుకొచ్చారు. గతేడాది ఆగస్టు 20న మొదటిసారి ఆమెకు కరోనా సోకిందనీ ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమె పొట్ట భాగంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండటంతోనే ఇలా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయన్న అనుమానం ఉందనీ దీనిపై పరిశోధన చేస్తున్నారని తెలిపారు. ఆమెకు ఎందుకు ఇలా ప్రతీసారి కరోనా వైరస్ పాజిటివ్ వస్తోందో అన్నది త్వరలోనే శాస్త్రవేత్తలు ఓ రిపోర్టులో వెల్లడిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.