Begin typing your search above and press return to search.

ఇది మ‌రీ దారుణం.. నెల జీతం 7 రూపాయ‌లు

By:  Tupaki Desk   |   12 July 2020 4:30 PM GMT
ఇది మ‌రీ దారుణం.. నెల జీతం 7 రూపాయ‌లు
X
గ‌త మూడు నెల‌ల్లో స‌గం జీతం వేశారు.. ఈ నెల‌లో పూర్తి జీతం రాబోతోంది.. మ‌న క‌ష్టాలు తీర‌బోతున్నాయి అని ఆశ‌గా ఎదురు చూసిన తెలంగాణ ఆర్టీసీ సిబ్బందికి అధికారులు పెద్ద షాకే ఇచ్చారు. ఏవేవో కారణాలు చెప్పి చడీచప్పుడు లేకుండా ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టింది ఆర్టీసీ. ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్‌లకు తోడు ఇంకేవో పేర్లు చెప్పి కోతలు విధించి నామమాత్రమైన జీతాలు అకౌంట్లలో వేశారు. సంగారెడ్డి డిపోకు చెందిన ఒక డ్రైవర్ జీతం రూ.20 వేలు కాగా.. జూన్ నెల వేతనం కింద కేవలం 49 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఆ డిపోలో 20 మందికి 100 రూపాయల లోపు జీతం పడిందట. 50 మందికి వెయ్యి రూపాయల్లోపు వేశారట.

భద్రాచలం డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు కేవలం రూ. 7 వేతనం మాత్రమే వచ్చిందని పేస్లిప్ చూపించి వాపోయాడు. ఇదే డిపోలో మరో కార్మికుడు రూ. 57 వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో వ్యక్తికి 77 రావడం గమనార్హం. భద్రాచలం డిపోలో మొత్తం 483 మంది పని చేస్తుండగా.. 400 మందికి ఇలా తక్కువ మొత్తంలో జీతాలు పడినట్లు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీలో 49 వేల మంది ఉద్యోగులు ప‌ని చేస్తుండ‌గా.. మెజారిటీ ఉద్యోగుల జీతాల‌కు ఇలాగే దారుణంగా కోత‌లు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇలా అన్యాయంగా కోతలు విధించి వంద లోపు, వెయ్యి లోపు జీతాలు వేస్తే తామెలా బతకాలని ఆర్టీసీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎంప్లాయిస్ యూనియన్ తీవ్ర‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్ర‌భుత్వం కార్మికుల ప‌ట్ల ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే మరో ఉద్యమం తప్పదని ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది.