Begin typing your search above and press return to search.

'కొవిడ్'కు ప్రపంచం చెల్లించిన మూల్యం లెక్క కట్టారు

By:  Tupaki Desk   |   29 Jan 2023 2:00 PM GMT
కొవిడ్కు ప్రపంచం చెల్లించిన మూల్యం లెక్క కట్టారు
X
వేలాది మందిని పొట్టన పెట్టుకొని.. లక్షలాది మందికి గుండెకోతను మిగల్చటమే కాదు.. కోట్లాది మందిని గజగజా వణికేలా చేసిన కరోనా విధ్వంసానికి సంబంధించిన ఒక నివేదికను లాన్సెట్ విడుదల చేసింది. కొవిడ్ వేళ యావత్ ప్రపంచం పెట్టిన ఖర్చును లెక్క కట్టారు. అమెరికాలోని వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేపట్టిన ఒక అధ్యయన నివేదిక లాన్సెట్ పబ్లిష్ చేసింది. ఇందులో కొవిడ్ మహమ్మారికి ప్రపంచం చెల్లించిన మూల్యం లెక్క వేశారు.
వారి లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ను కట్టడి చేసేందుకు చేసిన ఖర్చు రూ.30.08 లక్షల కోట్లు. ఇక.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కారణంగా చోటు చేసుకున్న మరణాల్లో 27.2 శాతం మరణాలు భారత్.. బంగ్లాదేశ్.. భూటాన్.. నేపాల్.. పాకిస్థాన్ లలో చోటు చేసుకున్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో కరోనా వేళ ఒక వ్యక్తి మీద అత్యధికంగా ఖర్చు చేసిన దేశంగా అమెరికా నిలిచింది.

అమెరికాలో ఒక్కో వ్యక్తి మీద సగటున రూ.16.81 లక్షల మొత్తాన్ని ఖర్చు చేయగా.. అతి తక్కువగా సోమాలియా నిలిచింది. అక్కడ ఒక్కో పౌరుడి మీద పెట్టిన ఖర్చు కేవలం రూ.733 మాత్రమే. ప్రజల ఆరోగ్యం కోసం భారత్ పెడుతున్న ఖర్చును కూడా లెక్క కట్టారు. 2019 నాటికి ఒక్కో పౌరుడి మీద భారత ప్రభుత్వం ఆరోగ్యం కోసం రూ.5658 ఖర్చు చేసిందని.. 2026 నాటికి ఇది కాస్తా రూ.7626కు చేరుకుంటుందని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ఆరోగ్యం మీద ఖర్చు భారీగా ఉండనున్నట్లుగా వెల్లడించారు. 2019లో దేశ జీడీపీలో 3 శాతం ఉన్న ఆరోగ్య ఖర్చు 2026 నాటికి 3.1 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. మొత్తంగా చూసినప్పుడు మాయదారి కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని మాత్రం చెప్పక తప్పదు.