ఎన్నికల ముందు కర్ణాటక సర్కార్ కొత్త పథకం ఇదే!

Mon Sep 26 2022 09:44:42 GMT+0530 (India Standard Time)

This is the new scheme of the Karnataka government ahead of the elections!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోంది. షెడ్యూల్ ప్రకారం.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది (2023) మేలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్నికలకు 8 నెలలు మాత్రమే ఉండటంతో బీజేపీ ప్రభుత్వం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతోంది.ముఖ్యంగా కర్ణాటకలో రైతు కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో వారిని ఆకట్టుకోవడం కోసం కొత్త పథకాలకు తెరలేపుతోంది. ఈ పథకాలు తమకు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిపెట్టగలవని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని.. దాన్ని సకాలంలో చెల్లించకపోతే రైతుల భూములను ఆస్తులను బ్యాంకులు జప్తు చేయకుండా కొత్త చట్టాన్ని తెస్తోంది. ఈ మేరకు చిత్రదుర్గలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఈ విషయాన్ని వెల్లడించారు.

పంటలకు సంబంధించి వివిధ అవసరాల నిమిత్తం రైతులు తమ భూముల మీద రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ రైతులు బ్యాంకులు తమకు ఇచ్చిన నిర్దేశిత సమయంలోగా రుణాలు చెల్లించలేకపోతే ముందుగా నోటీసులు జారీ చేస్తున్నాయి. ఆ తర్వాత రైతుల ఆస్తుల్ని భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇకపై ఇలా చేయడం కుదరదు.

రైతులు నిర్దేశిత సమయంలోగా బ్యాంకులకు రుణాలు చెల్లించకపోతే ఆస్తుల్ని జప్తు చేయడం ఇకపై కుదరదు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అలాగే రైతులు తాము తీసుకున్న రుణాలు తిరిగి సులభ పద్ధతుల్లో చెల్లించేలా అవకాశం కల్పిస్తారు.

ఇప్పటికే 14 లక్షల రైతు కుటుంబాలకు చెందిన పిల్లల కోసం విద్యానిధి పథకాన్ని రూపొందించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చెబుతున్నారు. ఇప్పుడా పథకాన్ని రైతు కూలీలు జాలర్లు ఆటో రిక్షా కార్మికులు ట్యాక్సీ డ్రైవర్లు చేనేత వర్గాలకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు.

"డబ్బు లేక ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. రైతుల కోసం ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. రైతులకు సమృద్ధిగా సాగునీరుతోపాటు మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. అయితే ప్రకృతి విపత్తుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు" అని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చెప్పారు.

ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తొలగించడానికి.. వారికి మరిన్ని మేళ్లు చేయడానికి కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు బొమ్మై తెలిపారు. ఈ కొత్త చట్టం అమలుతో రైతుల ఇబ్బందులు తొలగుతాయన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే బీజేఈ ఈ కొత్త చట్టాన్ని తెస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరి ఈ కొత్త చట్టం బీజేపీని తిరిగి అధికారంలోకి తేగలదో లేదో వేచిచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.