Begin typing your search above and press return to search.

2024 లో మోడీ పవర్ ఫుల్ నినాదం ఇదే...?

By:  Tupaki Desk   |   28 Jan 2023 9:30 AM GMT
2024 లో మోడీ పవర్ ఫుల్ నినాదం ఇదే...?
X
భారతీయ జనతా పార్టీ వ్యూహాలు బహు గొప్పవి. ఆ పార్టీలో మేధో సంపత్తి అలాంటిది. ఎపుడూ పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఎన్నో శాఖలు ఎంతో మంది అధ్యయనం చేస్తూ ఉంటారు. దేశంలో మళ్ళీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఏమి చేయాలి అన్న దాంట్లో తలపండిన వారు అంతా పరితపిస్తూ ఉంటారు.

భారతదేశం భౌగోళిక, రాజకీయ సామాజిక ఆధ్యాత్మిక స్వరూపాన్ని స్వభావాన్ని అంది పుచ్చుకుని దానికి తగినట్లుగానే బీజేపీ నినాదాలు ఉంటాయి. బీజేపీకి మరోసారి నరేంద్ర మోడీ ఇమేజ్ అతి పెద్ద ఆయుధం. మోడీ పట్ల దేశంలోని మెజారిటీ ప్రజలలో చెక్కుచెదరని నమ్మకం ఈ రోజుకీ ఉంది. ఆయనకు సరితూగే ప్రధాని అభ్యర్ధి ఈ రోజుకీ దేశంలో మరో పార్టీలో లేకపోవడం అడ్వాంటేజ్.

దాంతో బీజేపీ మోడీని ముందు పెట్టి పవర్ ఫుల్ నినాదాన్ని జనంలో చర్చకు పెడుతోంది. నిజానికి చూస్తే 2014లో బీజేపీ గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ మోడీని దేశాన్ని మొత్తం బాగుచేసే ప్రగతికాముకుడిగా ప్రెజెంట్ చేసింది. మోడీ వస్తే చాలు దేశం బంగారం అవుతుంది అన్నంతగా ఆ నినాదం చొచ్చుకుపోయింది. దాంతో మోడీ తొలిసారి బీజేపీకి బ్రహ్మాండమైన మెజారిటీని తెచ్చి ప్రధాని అయ్యారు.

ఇక 2019కి వచ్చేసరికి పరిస్థితులు మారాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏవీ. విదేశాల నుంచి తెచ్చే నల్ల ధనం ప్రతీ వారి అకౌంట్ లోకి ఎందుకు జమ అవలేదు అన్న ప్రశ్నలు వచ్చాయి. దాంతో బీజేపీ రూట్ మార్చింది.

దాయాది పాక్ తో ముప్పు పొంచి ఉందని చూపిస్తూ మోడీని ప్రధానిగా చేసుకుంటేనే దేశం మొత్తం హాయిగా గుండెల మీద చేయి వేసుకుని పడుకునే పరిస్థితి ఉంటుందని చెబుతూ దేశ రక్షకుడిగా మోడీని ప్రొజెక్ట్ చేస్తూ జనంలోకి వెళ్ళింది. దాంతో మూడు వందల మూడు సీట్లు బీజేపీని జనాలు కట్టబెట్టారు.

ఇక ఇపుడు చూస్తే పాక్ ఆయుధం పనిచేయదు. అభివృద్ధి మంత్రం కూడా కిక్కు ఇవ్వదు. దాంతో బీజేపీ మరో సరికొత్త ఆలోచన చేస్తోంది అంటున్నారు. అదేంటి అంటే మోడీని ప్రపంచ నాయకుడిగా జనంలో పెట్టి ఆ విధంగా ఆయన ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో చూపించడం. మోడీ ప్రపంచ గురువుగా మారారని, భారత్ ని మోడీ ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుపుతున్నారని, మోడీ వల్లనే ఈ రోజు విశ్వం మొత్తం భారత్ ని గౌరవిస్తోందని, మోడీ లాంటి స్ట్రాంగ్ లీడర్ ప్రధానిగా ఉండడం భారత్ కి గర్వ కారణం అని బీజేపీ చెప్పబోతోంది.

దానికి గాని ఈ ఏడాది భారత్ లో భారత్ అధ్యక్షతన జరగబోయే జీ 20 సదస్సుని వాడుకోబోతోంది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించడం ద్వరా భారత్ విశ్వనాయకత్వం వహిస్తోందని, ఇదంతా మోడీ సామర్ధ్యం వల్లనే దేశానికి దక్కిందని చెప్పబోతోంది. ఈ ఏడాదిలో తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటి నుంచే ఈ తరహా ప్రచారం బీజేపీ స్టార్ట్ చేసి 2024 నాటికి దానిని పీక్స్ కి తీసుకెళ్ళడం ద్వారా మోడీ విశ్వ నాయకుడు లోక నాయకుడు అని చాటి చెప్పబోతోంది అంటున్నారు. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.