దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్ .. ఎలా అంటే !

Sat Oct 31 2020 23:25:21 GMT+0530 (IST)

WhatsApp status Caught the thief .. How is that!

మనం ఏదైనా పోయింది అని కేసు పెడితే ఆ కేసు లో త్వరగా ఫలితం రావచ్చు రాకపోవచ్చు. కొన్ని కొన్ని కేసులు ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని అలాగే మరుగున పడుతుంటాయి కూడా .. అయితే కొన్ని కేసులు మాత్రం అనుకోని ఓ సందర్భంలో ఓ చిన్న క్లూ తో చాలా రోజుల తర్వాత ముగిసే అవకాశం కూడా ఉంది. ఆ తరహా కేసు ....ఇప్పుడు హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఆ కేసులో పోయిన బంగారం ఏడాది తర్వాత దొరకడం మరో విచిత్రం .. దానికి వాట్సాప్ స్టేటస్ కారణం కావడం మరో విశేషం అని చెప్పాలి.రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో సాయికిరణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయన గత ఏడాది జూలై 12 న గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో తన ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఎంత వెతికినా చోరీ అయిన సొమ్ము దొరకలేదు. కేసులో ఏ చిన్న క్లూ కూడా లేకపోవడం తో ఆ కేసు అలాగే ఉండి పోయింది. బంగారం పోయి కూడా సుమారు 15 నెలలు కావస్తుండడంతో ఆ దొంగతనం గురించి ఆ కుటుంబం కూడా మర్చిపోసాగింది.

తాజాగా వారి ఇంటి పక్కన ఉండే మహిళ సాయికిరణ్ వాళ్ల ఇంట్లో దొంగిలించిన నగను పెట్టుకొని దిగిన ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టింది. ఇది చూసిన సాయికిరణ్ అది తమ ఇంట్లో దొంగిలించినదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆ మహిళ కొడుకు జితేందర్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం అతని తల్లికి తెలిసే జరిగిందని పోలీసులు తెలిపారు. కొడుకును అరెస్ట్ చేసి ఆమెకు కూడా నోటీసులు జారిచేశారు. పోయిందనుకున్న సొమ్ము మళ్ళీ దొరకడంతో సాయికిరణ్ కుటుంబం ఆనందానికి అవధులు లేవు.