నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు: సీబీఐ మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు!

Mon Sep 26 2022 13:08:04 GMT+0530 (India Standard Time)

They threatened to kill me and my family: Ex-CBI JD

అవినీతి పరుల పాలిట సింహస్వప్నంలా నిలిచారు.. సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులను విచారించిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత స్వచ్ఛంధ పదవీ విరమణ చేశారు. గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం నుంచి ఆ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన లక్ష్మీనారాయణ ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొంత భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.జనసేన పార్టీకి రాజీనామా చేశాక లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరలేదు. మళ్లీ జనసేన పార్టీలోనే ఆయన చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేటలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

ఎన్నికల్లో డబ్బులే లేని ఎన్నికల విధానం రావాలని ఆకాంక్షించారు. మూలాల్లోకి వెళ్లి చికిత్స చేస్తేనే అవినీతిని నిర్మూలించగలమని చెప్పారు. సమాజంలో సామాన్యుల కంటే అవినీతిపరులు ఎలాంటి భయం లేకుండా సంచరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులను విచారిస్తున్నప్పుడు తనను తన కుటుంబాన్ని చంపుతామని కొంతమంది బెదిరించారని లక్ష్మీనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

సీబీఐలో పనిచేసేటప్పుడు తనకు ఎర్ర సిరాతో రాసిన లేఖలు వచ్చేవని తనను తన కుటుంబాన్ని చంపేస్తామని ఆ లేఖల్లో హెచ్చరించేవారన్నారు. తాను జేడీగా పనిచేసిన సమయంలో ఎన్నో క్లిష్టమైన కేసులను దర్యాప్తు చేశానని తెలిపారు. నిరాశ పడకుండా పని మీద మనం ప్రేమ పెంచుకుంటే ఏదైనా సాధించగలమని చెప్పారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగొచ్చన్నారు.

కాగా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై నెటిజన్లలో చర్చ జరుగుతోంది.  తనను చంపుతామని బెదిరించేవారని చెప్పిన లక్ష్మీనారాయణ వారెవరో చెప్పకపోయినా నెటిజన్లు తమదైన శైలిలో  అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.