Begin typing your search above and press return to search.

వాళ్లు యాచకులు కాదు.. ఆ ముసుగులో ఉన్న కుబేరులు!

By:  Tupaki Desk   |   10 Jun 2021 5:09 AM GMT
వాళ్లు యాచకులు కాదు.. ఆ ముసుగులో ఉన్న కుబేరులు!
X
కరోనా వేళ ఎన్నెన్నో విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయి. లాక్డౌన్ లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న యాచకులకు సాయం చేయాలనుకున్నారు పోలీసులు. వారికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వచ్చారు. రోడ్ల పక్కన ఉన్న వారందరినీ ఓ ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించుకున్నారు. కాగా అందుకు భిక్షాటన చేసేవారిలో కొందరు ససేమిరా అన్నారు. దీనిపై ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భిక్షాటన చేస్తున్న వారిలో కొందరు యాచకులు కాదు... ఆ ముసుగులో ఉన్న కుబేరులు.

రోడ్ల పక్కన ఉన్న యాచకుల్లో కొందరికి కరోనా నిర్ధరణ కాగా మిగతా వారిని ఆశ్రమానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు నాగర్ కోయిల్ పోలీసులు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల సాయంతో మంగళవారం నుంచి ఈ పనిని ప్రారంభించారు. వారిలో ఓ నలుగురు యాచకులు మాత్రం ఆశ్రమానికి వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. పైగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు దీనిపై ఆరా తీశారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

యాచకుల్లో ఒకరికి సొంత ఇళ్లు ఉన్నాయని చెప్పారు. కొన్ని ఇళ్లను అద్దెకు ఇస్తానని చెప్పారు. అంతేకాకుండా అతడు నగర శివారు నుంచి రోజూ ఆటోలో వచ్చి భిక్షాటన చేస్తానని చెప్పారు. మరో వృద్ధుడు తన దగ్గర నగదు ఉందని తెలిపారు. భిక్షాటన చేసి సంపాదించిన నోట్ల కట్టలను చూపించారు. మరో యాచకుడు రూ.3500 తో పాటు ఒ కత్తిని చూపించారు. రాత్రి వేళల్లో గంజాయి మత్తులో కొందరు తనని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మరక్షణగా కత్తి ఉన్నట్లు తెలిపారు.

దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. వారిని మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కాలంలోనూ ఇలాంటి పనులు చేయకూడదని చెప్పుకొచ్చారు. వీరితో పాటు మరికొందరు ఆశ్రమానికి వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. పోలీసులే కాదు స్థానికులు ఈ యాచక ముసుగులో ఉన్న కుబేరులను చూసి షాకయ్యారు.