సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కావడానికి అర్హతలేంటి? ఎలా నియమిస్తారు?

Thu Oct 29 2020 06:00:04 GMT+0530 (IST)

Who is eligible to become the Chief Justice of the Supreme Court? How to recruit?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాజాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ఇందులో కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అందరూ భావిస్తున్న ఓ సీనియర్ జడ్జిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ లేఖ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలా నియమిస్తారు? అందుకు అర్హతలు ఏంటనే చర్చ మొదలైంది.భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. ఇది దేశంలోని అన్ని న్యాయస్తానాలపై నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటుంది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టును స్థాపించారు. రాజ్యాంగంలోని 124-147 అధికరణలు భారత న్యాయవ్యవస్థ కూర్పు విధి విధానాలు అధికార పరిధిని నిర్ధేశించాయి.

సుప్రీం కోర్టు ప్రధాన హైకోర్టు తీర్పుల సవాళ్లను స్వీకరిస్తుంది. కొన్ని తక్షణ పరిష్కారం తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను సుప్రీం కోర్టు స్వీకరిస్తుంది.

సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిసి 8మంది న్యాయమూర్తులు తొలుత 1950లో ఉన్నారు. 2008 సంవత్సరానికి వచ్చేసరికి సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది.

*సుప్రీం కోర్టు న్యాయమూర్తికి ప్రధాన అర్హతలు ఇవీ
సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రధానంగా భారత పౌరుడై ఉండాలి. కనీసం 5 ఏళ్లు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. 10 ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయవాదిగా చేసి ఉండాలి. రాష్ట్రపతి న్యాయ నిపుణుల్లో న్యాయవేత్తగా పరిగణించి ఉండాలి.

*సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం ఇలా..
సుప్రీం కోర్టులో సుధీర్ఘకాలం పనిచేసిన సీనియర్ జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. రిటైర్ కాబోయే ప్రధాన న్యాయమూర్తి కొలీజియం ద్వారా సంప్రదించి కేంద్ర న్యాయశాఖకు తన సూచనను తెలియజేస్తారు.కేంద్ర న్యాయశాఖ ఆ సూచనను ప్రధానమంత్రికి పంపిస్తుంది. దానిని ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు.

అయితే భారతదేశ చరిత్రలో రెండు సార్లు సీనియర్ జడ్జిని కాదని ప్రధాన న్యాయమూర్తులుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ సినియర్లుగా ఉన్న ముగ్గురు జడ్జీలను కాదని.. నాలుగో వ్యక్తిని దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆ ముగ్గురు ఇందిరకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడమే ఆమె కోపానికి కారణమైంది.

మరోసారి ఎమర్జెన్సీ తర్వాత హెచ్ఆర్ ఖన్నాకు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి లభించలేదు. ఈయన నియామకంలోనూ సీనియారిటీని పాటించలేదు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నలుగురు సీనియర్ జడ్జిలతో ఏర్పాటు చేసిన కొలీజియంతో చర్చించి ప్రధాన న్యాయమూర్తిపై నిర్ణయం తీసుకుంటారు. తర్వాత కేంద్రన్యాయశాఖకు భారత ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. రాష్ట్రపతి ప్రధాని సూచన మేరకు చీఫ్ జస్టిస్ ను నియమిస్తారు.

ప్రధానంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నియామకంలో దేశ ప్రధాన మంత్రి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. అందుకే సీఎం జగన్ వ్యూహాత్మకంగా ప్రధాని మోడీని కలిశాక సుప్రీం కోర్టు జడ్జిపై లేఖను బహిరంగ పరిచారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..