Begin typing your search above and press return to search.

ఈ ఏడాదిలో ఎక్కువ మంది ఉపయోగించిన ఎమోజీలు ఇవే...!

By:  Tupaki Desk   |   5 Dec 2021 12:30 PM GMT
ఈ ఏడాదిలో ఎక్కువ మంది ఉపయోగించిన ఎమోజీలు ఇవే...!
X
స్మార్ట్ ఫోన్, డేటా వినియోగం అందుబాటులోకి వచ్చాక మనిషికి ఫోన్ కి విడదీయరాని బంధం ఏర్పడింది. ఒకప్పుడు చిన్న ఫోన్ ఉంటే... కేవలం ఎస్ఎంఎస్ లు మాత్రమే పంపించుకునే వారు. సాధారణ వాయిస్ కాల్స్ మాట్లాడేవారు. అయితే స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే మన జీవితంలోకి అడుగు పెట్టిందో.. అప్పటి నుంచి చాటింగ్ చేయడం ఎక్కువ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ కి తగ్గట్టుగానే అనేక చాటింగ్ యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా భావోద్వేగాలను కూడా షేర్ చేసుకోవడం ట్రెండ్ గా మారింది. ఇందుకుగానూ ప్రత్యేకంగా కొన్ని ఎమోజీలను తీసుకువచ్చాయి అప్లికేషన్లు. బాధ, ఆనందం, చిరాకు, కోపం, అసహ్యం లాంటి అనేక భావాలను ఎమోజీల రూపంలో వ్యక్తపరిచేందుకు అప్లికేషన్ ను ఉపయోగించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటిలో వేటిని ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుందాం రండి..

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఏ ఎమోజీలను ఉపయోగిస్తున్నారనే దానిపై ఓ ఎన్జీవో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొత్తంలో ఎక్కువమంది ఉపయోగించిన ఎమోజీ ఏంటి అంటే... ఆనందభాష్పలు వచ్చేలా ఉన్నట్టు కనిపించే ఎమోజీ. దీనిని ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించినట్లు సర్వే సంస్థ పేర్కొంది. ఆ తరువాతి స్థానంలో ప్రేమకు చిహ్నంగా ఎరుపు రంగులో ఉండే హార్ట్ సింబల్ ఎమోజీని ఎక్కువ మంది ఉపయోగించారు. ఈ రెండు ఎమోజీలు టాప్ టెన్ లో నిలిచినట్లు సర్వే సంస్థ పేర్కొంది. వీటితో పాటు బాధ కలిగినప్పుడు ఏడ్చే ఎమోజీ, అంతా మంచి జరగాలని చెప్పే విధంగా ఉండే తంసప్ సింబల్, దీనితోపాటు ముద్దులు ఇస్తున్నట్లు ఉండే ఎమోజీ, నీకు దండం పెడతారా బాబూ... అని ఉండే ఎమోజీ, ఆ తర్వాత కళ్లలో హార్ట్ సింబల్స్ ఉండేది అలా... సుమారు ఒక పది ఎమోజీలను ప్రపంచ వ్యాప్తంగా చాటింగ్ లో తెగ ఉపయోగిస్తున్నారు అని సర్వే సంస్థ వెల్లడించింది.

యూనికోడ్ కన్షార్షియమ్ అనే ఈ ఎన్జీవో చేసిన సర్వేలో మరికొన్ని విషయాలు వెల్లడయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ఉండే నెటిజన్లు ఎక్కువమంది ఎమోజీ లతో మాట్లాడుకునే దానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పింది. ఇలాంటి ఎమోజీలు సుమారు మూడు వేలకు పైగా అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది వీటితో పాటు ఇటీవల ఈ కాలంలో బాగా పాపులర్ అయినటువంటి స్టిక్కర్లు కూడా వీటికీ పోటీగా వస్తున్నట్లు చెప్పింది. స్టికర్లు వినియోగం కూడా నానాటికీ పెరుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఒకప్పుడు కేవలం సమాచారాన్ని పంపించడానికి మాత్రమే ఉపయోగించే ఎస్ఎంఎస్ లు ఇప్పుడు ఎమోజీల రూపంలో భావవ్యక్తీకరణకు కూడా ఉపయోగపడుతున్న ట్లు సర్వే సంస్థ పేర్కొంది.