Begin typing your search above and press return to search.

'వర్క్ ఫ్రమ్ హోమ్’ కి ఇప్పట్లో ముగింపు లేనట్లే .. !

By:  Tupaki Desk   |   23 Sep 2021 4:30 PM GMT
వర్క్ ఫ్రమ్ హోమ్’ కి ఇప్పట్లో ముగింపు లేనట్లే .. !
X
కరోనా వైరస్ మహమ్మారి వెలుగులోకి రాక ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కేవలం ఐటీ ఉద్యోగులకి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తెలుసు. ఐటీ ఉద్యోగులకు వారికున్న ఆరోగ్య సమస్యలు లేదంటే, ఇంట్లోని పరిస్థితుల కారణంగా పరిమిత కాలానికి వర్కు ఫ్రం హోం ఇచ్చేవారు. అయితే, కరోనా మహమ్మారి దెబ్బకి అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరిగింది. మొదటి వేవ్ ను తలదన్నేలా సెకండ్ వేవ్ రావటం, మూడో వేవ్ లో పిల్లలే టార్గెట్ అవుతారన్న ప్రచారం బాగా జరగటం తెలిసిందే.

ఇప్పటికే థర్డ్ వేవ్ వస్తుందని అన్న మాటలకే కానీ, అలాంటిదేమీ లేకపోవటం. స్థిరంగా కేసుల నమోదు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ కావటం మొదలు పెట్టారు. చాలా కంపెనీలు ఇప్పుడిప్పుడే ఆఫీసులకు తమ ఉద్యోగుల్ని రావాలని పిలుస్తున్నాయి. ఐటీలో అగ్రశ్రేణి కంపెనీలు కొన్ని మాత్రం వచ్చే ఏడాది వరకు ఇంటి నుంచే పని అని చెప్పగా, మిగిలిన చాలా కంపెనీలు మాత్రం సెప్టెంబరు ఒకటి నుంచి ఆఫీసుకు రమ్మని చెబితే మరికొన్ని కంపెనీలు మాత్రం అక్టోబరు, నవంబరులో ఉద్యోగులు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. అయితే, చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయటానికే మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ తీరు ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉందని తాజా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.

లండన్ కు చెందిన ప్రైజ్ వాటర్ హైజ్ కూపర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించింది. వర్కు ఫ్రం హోంలో ఉన్న 41 శాతం ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయటానికి ఇష్టపడటం లేదని నివేదిక స్పష్టం చేసింది. జనవరి లో ఈ కంపెనీ నిర్వహించిన సర్వేలో 29 శాతం మంది మాత్రమే ఆఫీసుకు వచ్చి పని చేయటానికి ఇష్టపడకుంటే, రెండో వేవ్ తర్వాత తాజాగా మాత్రం ఉద్యోగులుకు మరింత ఎక్కువ మంది ఆఫీసుకు రావటానికి ఆసక్తిని చూపించకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే భారత్ కు చెందిన ఒక ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ ఆగస్టు రెండో వారంలో లక్షన్నర మంది ఉద్యోగుల అభిప్రాయాలతో ఒక సర్వేను నిర్వహించింది.

ఇందులో 48 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్కు ఫ్రంహోంకు మొగ్గు చూపినట్లుగా తేల్చారు. రిమోట్ వర్కుతో తాము ఒత్తిడిలో ఉన్నప్పటికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉన్నట్లుగా చెప్పటం గమనార్హం. ఇంటి నుంచి పని చేస్తున్న చాలామంది ఉద్యోగులు, కరోనా వేళలో ఇళ్లకు వెళ్లిపోవటం తెలిసిందే. హైదరాబాద్ వరకు చూస్తే.. తమ స్వగ్రామాలకు వెళ్లిపోయిన వారు, అక్కడే ఉండిపోతున్నారు. సుమారు 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ను వదిలి తమ ఊళ్లకు వెళ్లిపోయి ఉంటున్నారు. అలాంటి వారు తిరిగి వచ్చి మళ్లీ అద్దె ఇళ్లల్లోకి చేరటానికి హాస్టల్స్ లో చేరటానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికైతే వర్క్ ఫ్రం హోం ఇవ్వాల్సిందేనని కంపెనీల్ని అడుగుతున్నారు. అందుకు నో చెబుతున్న కంపెనీలను వదిలి పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదంటున్నారు. కంపెనీకి వచ్చి పని చేయాలని అడిగిన ఉద్యోగుల్లో అనుభవం ఉన్న వారు జాబ్ వదిలేసి.. తాము కోరినట్లు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉన్న కంపెనీల్లో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో.. కొన్ని కంపెనీలు మానవవనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో.. అట్రిషన్ రేటు ఎక్కువ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కి ముగింపు వచ్చేలా లేదు.