Begin typing your search above and press return to search.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు దుర్మరణం !

By:  Tupaki Desk   |   26 Feb 2020 8:00 AM GMT
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు దుర్మరణం !
X
అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ రోడ్డు ప్రమాదం ఆదివారం సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. మరణించిన వారిని రాజా గవిని,అతని భార్య ఆవుల దివ్య, వారి కుటుంబ స్నేహితుడు ప్రేమ్ నాధ్ రామనాధంగా గుర్తించారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణం ఎఫ్ఎం 423పై డెల్ వెబ్ బౌలే‌వార్డ్ జంక్షన్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

అసలు ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది అంటే .. ప్రస్తుతం వీరు టెక్సాస్‌ రాష్ట్రంలోని శానియాంటో నుంచి బదిలీపై డాలస్‌ నగరానికి వచ్చారు. వీరి స్నేహితుడు, గుంటూరు జిల్లాకు చెందిన ప్రేమ్‌నాథ్‌ తన నివాసంలో వీరికి బస కల్పించాడు. గవిని రాజు వెల్స్‌ ఫార్గో బ్యాంకులో పని చేస్తుండగా, దివ్య నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వీరు డల్లాస్‌ సమీప పట్టణం ఫ్రిస్కోలో నూతనంగా సొంతింటిని నిర్మించుకుంటున్నారు. ఆదివారం కావడంతో కూతురు రియాను డాన్స్‌ క్లాసులో వదిలి వారి నూతన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించేందుకు కారులో వెళ్లారు.

వీరితో పాటు ప్రేమ్‌నాథ్‌ కూడా వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో స్కూల్‌ జోన్‌ కావడంతో జంక్షన్‌ వద్ద తమ వాహనాన్ని స్లో చేశారు. అదే సమయంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి కారును ఢీకొట్టిన వాహనాన్ని మైనర్‌ నడుపుతున్నట్లు ఫ్రిస్కో పోలీసులు గుర్తించారు. మృతుల్లో రాజా,దివ్య హైదరాబాద్, ముషీరాబాద్ లోని గాంధీనగర్ కు చెందినవారు కాగా రామనాధం విజయవాడకు చెందినవారు. నాలుగు సంవత్సరాల క్రితమే వారు టెక్సాస్ లో స్ధిర పడినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు ..పుట్టిన రోజు నాడే మరణవార్త వింటాం అని అనుకోలేదు అంటూ తీరని శోకంలో మునిగిపోయారు. ఆ ముగ్గురి మృతదేహాలు శుక్రవారం నగరానికి చేరుకునే అవకాశం ఉంది. వారి స్నేహితులు, తానా అసోసియేషన్‌ కలిసి మృతదేహాలను హైదరాబాద్‌కు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.