Begin typing your search above and press return to search.

కరోనా ఇష్యూలో చైనాను ఏమీ పీకలేకపోతున్న ప్రపంచం

By:  Tupaki Desk   |   15 Oct 2021 10:30 AM GMT
కరోనా ఇష్యూలో చైనాను ఏమీ పీకలేకపోతున్న ప్రపంచం
X
కాలం చాలా చిత్రంగా ఉంటుంది. ప్రపంచాన్ని వణుకు పుట్టించిన కరోనా మహమ్మారి కేసులు వెలుగు చూడటం మొదలు పెట్టి.. అప్పుడే రెండేళ్లు కావొస్తోంది. చైనాలోని వూహాన్ మహానగరంలో వెలుగు చూసిన ఈ మహమ్మారి.. కాల క్రమంలో యావత్ ప్రపంచాన్ని పాకేయటమే కాదు.. కలలో కూడా ఊహించని దారుణ పరిస్థితుల్ని తీసుకొచ్చింది. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేసింది. లాక్ డౌన్ అనుభవం మొత్తం ప్రపంచానికి అర్థమైంది. దీనంతటికి కారణమైన చైనాలోని వూహాన్ లో ఏం జరిగిందన్న దాని మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన దర్యాప్తు టీం పరిశోధనలు చేసినా.. ఫలితం మాత్రం రాకపోవటం గమనార్హం.

ఈ నేపథ్యంలో మరోసారి దర్యాప్తును చేపట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చేస్తున్న ప్రయత్నమే చివరిదన్న భావన వ్యక్తమవుతోంది. కొవిడ్ వెలుగు చూసిన మొదట్లో నాటి కేసుల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని చైనా ఇవ్వకపోవటం.. ఆ దిశగా సాగే విచారణ విషయంలో సహకరించకపోవటంతెలిసిందే. దీంతో.. ఈ అంశం పెద్ద చిక్కుముడిగా మారినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేషన్ చెబుతున్నారు. కొవిడ్ మూలాలపై తాజాగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా టీంలో మొత్తం 26 మంది ఉండనున్నట్లు చెబుతున్నారు.

జంతువుల నుంచి మనుషులకు వైరస్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవటానికి డజన్ల కొద్దీ అధ్యయనాల్ని చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 2019 డిసెంబరు కంటే ముందు తీసుకున్న రక్త నమూనాలు.. అనుమానిత కేసుల వివరాల్ని విశ్లేషించటంతో పాటు.. అక్కడి ఆసుపత్రుల్ని పరిశీలించటం.. అక్కడ చోటు చేసుకున్న మరణాల వివరాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు వూహాన్ నగరంలోని మెడికల్ ల్యాబ్ లపైనా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే.. ఇందుకు చైనా మాత్రం పెద్దగా సహకరించకపోవటం గమనార్హం.

ఇప్పుడీ పరిశోధనలో ఏమీ తేలకపోతే.. రానున్న రోజుల్లో మరేమీ తేలే అవకాశం లేదని.. ఇదే చివరి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన టీం చైనాలో నాలుగు వారాలపాటు పర్యటించినప్పటికీ వారికి సరైన సమాచారాన్ని అందించలేదన్న ఆరోపణలు.. విమర్శలు వచ్చాయి. కోవిడ్ 19కు చెందిన వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయినట్లుగా రావటం.. దీన్ని చైనా తోసిపుచ్చటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి విలయానికి కారణమైన మహమ్మారి మూలాలపై చైనాలో మరోసారి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. నిజమే.. అందుకు ఓకే చెబితే.. దాని గుట్టు రట్టు కావటమే కాదు.. ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది కదా? దొంగ నాటకాల డ్రాగన్ కు అంత ధైర్యం ఉండదు కదా? ప్రపంచానికి మహా విషాదాన్ని మిగిల్చిన చైనాను యావత్ ప్రపంచం పెద్దగా పీకిందేమీ లేదన్న విమర్శ పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.