సలసలకాగే నూనెలో భార్య చేయి పెట్టించాడు .. ఎందుకంటే - వీడియో వైరల్ !

Tue Feb 23 2021 16:21:26 GMT+0530 (IST)

The wife put her hand in the oil

భార్య పై అనుమానం కలిగితే భార్య కి అగ్ని పరీక్ష పెట్టేవారని వాళ్లు అందులోంచి పవిత్రంగా బయటకు వచ్చారని పురాణం ఇతిహాసాలలో చదువుకున్నాం. వారంటే దేవతలు కాబట్టి వారిని అగ్ని ఏం చేయలేదు. అచ్చం పురాణాల్లో లాగే చేశాడో భర్త. ఓ మహిళ నాలుగు రోజులు కనిపించకుండా పోయింది. ఆ తరవాత తిరిగి వచ్చింది. ఆమె చెప్పిన దానిని నమ్మని భర్త ఆమె చెప్పింది నిజం అని నిరూపించుకోవాలని చెప్పాడు. దానికోసం సలసల కాగే నూనెలో ఐదు రూపాయల కాయిన్ వేశాడు. వాటిని ఆమె చేతితో తీయాలన్నాడు. ఈ   ఘటన మహారాష్ట్రలోని ఉస్మాన్ బాద్ లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే .. ఫిబ్రవరి 11న భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లి పోయింది. ఆమె భర్త కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆమె కోసం నాలుగు రోజులు తీవ్రంగా వెతికాడు. అయినప్పటికి ఆమె ఆచూకీ దొరకలేదు. ఓ రోజు ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. గొడవ పెట్టుకుని బయటకు వెళ్లిన రోజున ఉస్మాన్ బాద్ లో పరాండలో ఖాచపూరి చౌక్ బస్టాప్ దగ్గర బస్ కోసం నిల్చున్నానని.. ఓ ఇద్దరు వ్యక్తులు తనను బైక్ పై బలవంతంగా తీసుకెళ్లినట్లు చెప్పింది. నాలుగు రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకున్నారని వాపోయింది. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నానని చెప్పింది.

దీనితో తన భార్య చెప్పేది నిజమా కాదా అని తెలుసుకునేందుకు అగ్ని పరీక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. వారి కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం సలసల కాగే నూనెలో నుంచి వేసిన ఐదు రూపాయల కాయిన్ తీయాల్సిందిగా చెప్పాడు. అంతేకాదు ఈ ఘటనను వీడియో తీశాడు. కాయిన్ తీసే క్రమంలో మహిళ చేతికి గాయం అయినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్నిపరీక్ష పేరుతో మహిళలను వేధిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర లెగిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నీలమ్ గోర్హే రాష్ట్ర హోంశాఖను డిమాండ్ చేశారు.