Begin typing your search above and press return to search.

అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇక ఈజీనే.. సెనేట్ ఆమోదించ‌డ‌మే తరువాయి!

By:  Tupaki Desk   |   14 Sep 2021 7:36 AM GMT
అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇక ఈజీనే.. సెనేట్ ఆమోదించ‌డ‌మే తరువాయి!
X
అధ్య‌క్షుడు బైడెన్ నేతృత్వంలోని అమెరికా.. తీసుకోబోతున్న నిర్ణ‌యం భార‌తీయులకు మేలు చేస్తుందా? గ్రీన్ కార్డు కోసం.. చ‌కోర ప‌క్షుల్లా ఎదురు చూస్తున్న వారికి ఇక‌, ఎలాంటి ఎదురు చూపులు లేకుండానే గ్రీన్ కార్డు ల‌భిస్తుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అమెరికా ప్రభుత్వం తాజాగా బడ్జెట్ రీకన్సిలేషన్ బిల్‌లో భాగంగా ఇమ్మిగ్రేషన్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ఇకపై గ్రీన్ కార్డు పొందేందుకు భారతీయులు ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని వారు చెబుతున్నారు.

అమెరికాలో శాశ్వతంగా నివశించేందుకు అవసరమైన గ్రీన్ కార్డ్ అందించేందుకు ప్రతి దేశానికీ ఓ పరిమితి ఉంటుంది. అలాగే భార‌త్‌కు కూడా అమెరికా కొన్ని నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తోంది. అయితే తాజాగా ప్రవేశ పెట్టబోతున్న బిల్లుతో భార‌త్‌కు ఈ పరిమితి నుంచి మినహాయింపు పొందేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 5 వేల డాలర్లు సూపర్ ఫీజ్ చెల్లిస్తే ఈ మినహాయింపు లభిస్తుంది.

అనేకమంది భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే అత్యధికంగా ఉద్యోగ సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారినే పరిగణలోకి తీసుకుంటున్నారు. అందులోనూ అత్యధిక శాతం హెచ్1-బీ వీసాలు. ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలే అత్యధికంగా తమ ఉద్యోగులు గ్రీన్ కార్డులు పొందేందుకు స్పాన్సర్ చేస్తున్నాయి. నైపుణ్యం గల ఉద్యోగులే ప్రాధాన్యంగా ఆయా సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు వేగంగా గ్రీన్ కార్డు పొందేందుకు అధికమొత్తంలో ఫీజులు చెల్లిస్తుండడం గమనార్హం.

భారతీయులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప‌లువ‌రు పేర్కొంటున్నారు. ఎంప్లాయిమెంట్ గ్రీన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి లాభం చేకూరుతుందని, ఇప్పటివరకు అమలులో ఉన్న పరిమితుల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఈ బిల్లు తుది బిల్లు కాదని, ఇందులో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత తుది బిల్లు పార్లమెంట్‌కు చేరుతుందని, బిల్లులో చేసిన ఇమ్మిగ్రేషన్ నిబంధనల వల్ల దేశానికి లాభం చేకూరుతుందా లేదా అనే దానిపై సభ్యులు చర్చిస్తారని, అయితే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు బడ్జెట్ రికన్సిలేషన్ బిల్లులో భాగం కనుక దీనికి భారీ మెజారిటీ అవసరం లేదని అంటున్నారు.

ఈ బిల్లు క‌నుక ఆమోదం పొందితే.. రెండేళ్ల‌కు ముందే 5000 డాల‌ర్లు అద‌న‌పు రుసుము చెల్లించి గ్రీన్ కార్డ్ పొంద‌వ‌చ్చు. అదేస‌మ‌యంలో టీబీ-5 వీసాదారులు 50 వేల డాల‌ర్లు, కుటుంబ ఆధారిత వ‌ల‌స‌దారులు 2500 డాలర్లు చెల్లించి గ్రీన్ కార్డును సొంతం చేసుకోవ‌చ్చు. ఏదేమైనా.. ఈ బిల్లు ఆమోదం పొందితే.. ఖ‌చ్చితంగా భార‌తీయుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి బైడెన్ స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.