Begin typing your search above and press return to search.

ఇదెక్కడి బరితెగింపు? కడ్తాల్ దావత్ వెనుక సంచలన నిజం

By:  Tupaki Desk   |   16 Jun 2021 12:30 PM GMT
ఇదెక్కడి బరితెగింపు? కడ్తాల్ దావత్ వెనుక సంచలన నిజం
X
షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ప్రధాన మీడియాలో వచ్చిన ఒక చిన్న వార్త వెనుక గుండెలు అదిరిపోయే నిజం ఉందా? ఒక వ్యక్తి ఇచ్చిన పుట్టిన రోజు పార్టీ అని పేర్కొన్న దాని వెనుక ఒక దుర్మార్గమైన వ్యాపారం ఉందా? అంటే అవునని చెబుతున్నాయి పోలీస్ వర్గాలు. మూడు రోజుల క్రితం కడ్తాల్ లో ఒక పుట్టినరోజు పార్టీ జరగటం.. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున సౌండ్లతో నిర్వహిస్తున్న ఈ వేడుక గురించి పోలీసులకు సమాచారం అందటంతో అక్కడకు వెళ్లి.. ఆ పార్టీకి హాజరైన అమ్మాయిలు.. అబ్బాయిల్ని పెద్ద ఎత్తున అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీని నిర్వహించిన నిర్వాహకుల్లో కీలకమైన వారు మిస్ అయినట్లుగా పోలీసులు చెప్పారు.

ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. జరిగింది పుట్టినరోజు పార్టీ కాదని గుర్తించి అవాక్కు అయ్యారు. పార్టీకి వచ్చి పట్టుబడిన యువతీయువకుల్ని పార్టీ నిర్వహించినట్లుగా చెబుతున్న వరుణ్ గౌడ్ ఎవరో తమకు తెలీదనటంతో.. అసలు మీరెందుకు అక్కడికి వెళ్లారు? అక్కడి పార్టీ గురించి మీకు ఎలా తెలిసిందని పోలీసులు ప్రశ్నించారు. దీనికి వారు.. ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేస్తే వెళ్లినట్లుగా చెప్పారు.

లాక్ డౌన్ నేపథ్యంలో పబ్బులు మూసేయటంతో.. నగర శివారులోని ఫాంహౌస్ లలో ఈవెంట్లను నిర్వహించే ప్లాన్ చేశారు. వీటి సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక పార్టీల పేరుతో సమాచారాన్ని అందిస్తున్నారు. వీటి గురించి తెలుసుకున్న వారు.. ఒక్కొక్కరు రూ.5వేల చొప్పున ఎంట్రీ పీజు చెల్లించి మరీ పార్టీకి వెళ్లినట్లుగా గుర్తించారు.

ఈ పార్టీని నిర్వహించిన వ్యక్తులు ఎవరన్న ఆరా తీసిన పోలీసులకు గతంలో డ్రగ్స్ ను కొరియర్ ద్వారా పార్టీలకు సరఫరా చేసే జీషన్ అలీఖాన్ అలియాస్ జాక్ అన్నది సందేహంగా మారింది. 2018లో ఇతగాడిపై నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు గుర్తించారు. ఇప్పుడు అనుమానిస్తున్న జాక్.. గతంలో కేసు నమోదైన జీషన్ అలీఖాన్ ఒక్కరేనని తేలితే అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ప్రత్యేక పార్టీల్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. దానికి భారీగా వెళ్లే వరకు విషయం వెళ్లటం.. అసలు ఆ పార్టీలో ఏమేం వినియోగిస్తున్నారన్నది ఇప్పుడు సందేహంగా మారింది. మరింత లోతుల్లోకి వెళితే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.