సినిమాల్లో విజిల్స్ వేసే సీన్ రియల్ గా చూపించిన తీన్మార్ మల్లన్న

Sun Mar 07 2021 13:00:01 GMT+0530 (IST)

The scene where the whistles are blown in the movies is shown by Teenmar Mallanna

ఈసడించుకోవటం..ఆదర్శాలు వల్లించటం.. మాటలకు చేతలకు సంబంధం లేకుండా వ్యవహరించే చోట.. సినిమాల్లో కనిపించే సినిమాటిక్ సీన్లను రియల్ లైఫ్ లో కనిపించటం చాలా అరుదు. అందునా రాజకీయాల్లో.. కీలకమైన ఎన్నికల చాలా చాలా తక్కువ. కానీ.. రీల్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ సీన్ ను చూపించారు తీన్మార్ మల్లన్న. తాజాగా నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ అధికారపార్టీ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి మొదలు కోదండ రాం లాంటి పెద్ద పెద్దోళ్లు బరిలో ఉన్న వేళ.. వినూత్న తరహాలో ప్రజల ముందుకు వచ్చారు.తాజాగా ఒక చానల్ లైవ్ లో మాట్లాడిన తీన్మార్ మల్లన్న రెండు ప్రత్యేకమైన హామీల్ని ప్రజలకు ఇచ్చారు. తాను గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడానని.. మరోసారి ప్రయత్నిస్తున్నానని.. తనను గెలిపించాలని కోరుతున్నారు. తన మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టారని.. అదొక్కటి చాలని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానెంత పని చేశారన్నది ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు.

తనను ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే తానేం చేయనున్న విషయాన్ని రెండు ముక్కుల్లో తేల్చేస్తున్నారు. రెండు బాండ్ పేపర్ల మీద సంచలన అంశాల్ని ప్రస్తావించి.. సంతకం పెట్టేస్తున్నారు. అందులో ఒకటి.. తాను రాజకీయాల్లో సంపాదించిన మొత్తం ఏదైనా సరే.. తాను మరణించిన తర్వాత తన ఒంటి మీద బట్టలు తప్పించి మిగిలిన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కాకుండా.. ప్రభుత్వానికి ఇచ్చేస్తానని చెప్పారు. ప్రభుత్వమే తన ఆస్తులు మొత్తాన్ని స్వాధీనం చేసుకోచ్చన్నారు.

ఇక.. రెండోది మరో బాండ్ పేపర్ మీద.. తాను గెలిచిన తర్వాత తన పదవీ కాలం సగం పూర్తి అయ్యాక.. తన పనితీరు మీద మరోసారి ఎన్నికనునిర్వహించొచ్చని.. అందులో యాభై శాతం కంటే తక్కువగా ఓట్లు వస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసురుతున్నారు. ఇలాంటి సవాళ్లు చట్టబద్దం కావు కదా? అన్న ప్రశ్నకు.. తన మాటను చెప్పే అవకాశం ఇచ్చిన సదరు చానల్ మధ్యవర్తిగా ఉండి.. మూడేళ్ల తర్వాత పోల్ నిర్వహిస్తే.. అందులో వచ్చిన ఫలితం ఆధారంగా తాను నిర్ణయం తీసుకుంటానని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి ఆదర్శాలు ఎవరూనా చెబితే.. సినిమాల్లో విజిల్స్ వేసి.. అదరగొట్టేస్తాం. మరి.. రీల్ కు మించి సవాలు విసురుతున్న తీన్మార్ మల్లను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేస్తారో చూడాలి.